కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న సప్తగిరుల పై వెలసిన తిరుమల క్షేత్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 80కి చేరడంతో కంటైన్మెంట్‌జోన్ పరిధిలోకి తీసుకువస్తూ అధికారులు తొలుత చేసిన ప్రకటనతో ఇటు స్థానికులేగాక అటు భక్తులు కూడా ఉత్కంఠకు గురికావలసి వచ్చింది. కంటైన్మెంట్ జోన్ పరిధిలో వున్న ప్రాంతానికి బయటి వ్యక్తుల రాకపోకలు నిషేధం. అలాంటిది తిరుమల క్షేత్రాన్ని ఈ జోన్ పరిధిలో ప్రకటించడంతో ఒకింత ఆందోళన కలిగించింది. ఆ తరువాత కొద్దిగా తేరుకున్న రాష్ట్ర, జిల్లా అధికారులు కంటైన్మెంట్ జోన్ నుంచి తిరుమలను తొలగించినట్లు సాయంత్రం 3గంటల బులెటిన్లో మరో ప్రకటన చేయడంతో అందరూ ఊరట చెందారు. గత వారం వరకు 70 మంది టిటిడి ఉద్యోగులు, సిబ్బంది ఆలయంలో, ఇతరత్రా విధులు నిర్వహిస్తున్న వారు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. దీంతో తిరుమలలో గత ఆదివారం టిటిడి ధర్మకర్తలమండలి కూడా అత్యవసర సమావేశమై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, తదుపరి పరిణామాలపై చర్చించింది.
అయితే తాజాగా మళ్లీ మరో పదికేసులు తిరుమలలో కరోనా పాజిటివ్ నమోదవడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో తిరుమలను ఒక్కసారిగా కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. అయితే శ్రీవారి ఆలయం మాత్రం తెరిచే వుంటుందని ప్రకటించారు. కానీ అధికారుల్లో కూడా భక్తుల సంశయం మెదలడంతో వెనువెంటనే కంటైన్మెంట్ జోన్ నుంచి తొలగించారు. తిరుపతి నుంచి తిరుమలకు ప్రయాణించే ఉద్యోగుల్లో కొందరికి పాజిటివ్ లక్షణాలు రావడంతోనే తిరుమలలో ఇప్పుడు ఆందోళన తీవ్రమైంది. ప్రతిరోజూ 200మంది టిటిడి సిబ్బందికి కరోనా ర్యాండమ్ పరీక్షలు చేస్తు న్నారు. భక్తులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం వరకు 800మంది భక్తులకు ర్యాండమ్ పరీక్షలు చేస్తే అందరికీ నెగిటివ్ రావడం విశేషం. మరోవైపు తిరుపతి పరిసరాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గురువారానికి చిత్తూరుజిల్లాలో 2,459కేసులు నమోదయ్యాయి. తిరుమల ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ చేయడం... ఆ తరువాత తోలగించడం మాత్రం అధికారుల తీరును భక్తులు తప్పుపడుతున్నారు.