ఆగస్టు 12 నుంచి 16వ తేదీ వరకు, తిరుమల దర్శనం ప్లాన్ చేసుకున్నారా ? అయితే, ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆ సమయంలో, పరిమితి స్థాయిలోనే, అతి తక్కువ మందికి మాత్రమే స్వామి వారి దర్శనం జరుగుతుంది. ఇవి వివరాలు... మహా సంప్రోక్షణ సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని ఐదు రోజుల పాటు పూర్తిగా నిలిపివేయాలని తితిదే సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నెల 24న జరగనున్న దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణకు ఆగస్టు 12 నుంచి 16 వరకు తితిదే ముహూర్తం నిర్ణయించింది. 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహా క్రతువు సందర్భంగా వైదిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతారు. వైఖానస ఆగమ నిబంధనల మేరకు ఆ సమయంలో ఆలయ సిబ్బంది సైతం బంగారు వాకిలి దాటి లోపలికి వెళ్లే అవకాశం ఉండదు.
గర్భాలయంలో మరమ్మతులనూ అర్చకులే చేస్తారు. ఆనంద నిలయం చుట్టూ కూడా పలు క్రతువులు జరగనున్నాయి. ఈ కారణంగా శ్రీవారి దర్శనాన్ని గంటల తరబడి నిలిపివేయాల్సి ఉంటుంది. కొద్ది సమయం మాత్రమే.. పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనం అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో వరుస సెలవులు ఉండడంతో పాటు సంప్రోక్షణను పురస్కరించుకొని భక్తులు అధికంగా తరలివస్తే.. దర్శనం కల్పించటం సాధ్యపడదని తితిదే అంచనా వేస్తోంది. ఈ తరుణంలో స్వామివారి దర్శనాన్ని పూర్తిస్థాయిలో నిలిపివేయాలని యోచిస్తోంది. తిరుమలకు చేరుకున్నాక యాత్రికులు నిరీక్షించడం కంటే.. ముందుగానే అప్రమత్తం చేయడం ఉత్తమమన్న ఆలోచనతో ఉంది.
పన్నెండేళ్లకోసారి ఈ క్రతువును నిర్వహిస్తారని, శ్రీవారి ఆలయంతో పాటు అన్ని ఉపఆలయాల మహాసంప్రోక్షణ చేస్తారని అన్నారు. ఆగస్టు 11, 12 తేదీల్లో నిర్వహించే తోమాల, అర్చన సేవలకు ఉదయాస్తమాన సేవ భక్తులను మాత్రమే అనుమతిస్తారు. 16న ఉదయం మహాసంప్రోక్షణ జరుగుతుంది. చివరి రోజున యాగశాలలోని ఉత్సవమూర్తులను గర్భాలయంలోకి చేర్చడంతో వైదిక కార్యక్రమాలు సమాప్తమవుతాయి. మహాసంప్రోక్షణలో భాగంగా శ్రీవారి మూలవిరాట్టు, ఇతర దేవతామూర్తుల శక్తిని బింబం నుంచి కుంభంలోకి ఆవాహనచేసి ఉపచారాలు, శాంతిహోమాలు నిర్వహిస్తామని ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. అష్టబంధనం అంటే ఎనిమిది రకాల వస్తువులతో తయారుచేసిన చూర్ణమని, దీని ఆయుర్దాయం 12 ఏళ్లు ఉంటుందని ఆగమ సలహాదారు సుందర వరదభట్టాచార్యులు వివరించారు. ఈ అష్టబంధనాన్ని శ్రీవారి పాదాల కింద ఉంచుతామన్నారు.