గత కొన్ని రోజులుగా మన రాష్ట్రంలో, అతి పెద్ద కుట్ర మొదలైంది. సాక్షాత్తు కలియుగ దైవం వెంకన్నను రాజకీయాల కోసం వాడుకుని, పబ్బం గడుపుకునే వాళ్ళను చూసాం. తిరుమలలో ఎన్నో నేరాలు, ఘోరాలు జరిగిపోతున్నాయి అంటూ, ఒక అభూత కల్పనకు తెర లేపారు. దీని డైరెక్షన్ అంతా ఢిల్లీ నుంచే జరిగింది. మన రాష్ట్రంలో ఇన్ని కుట్రలు జరుగుతుంటే, పక్క రాష్ట్రాలు మాత్రం తిరుమలనే ఆదర్శంగా తీసుకుంటున్నాయి. తిరుమల భేష్ అంటూ, మేము తిరుమలను చూసి నేర్చుకుంటాం పాఠాలు చెప్పమంటున్నాయి. ఒడిశాకు చెందిన ఉన్నతస్థాయి కమిటీ సోమవారం తిరుమల శ్రీవారి ఆలయం, తితిదే పాలనావ్యవస్థను అధ్యయనం చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒడిశా రాష్ట్రం పూరిలోని శ్రీ జగన్నాథస్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటుచేసింది. తిరుపతిలోని శ్రీ పదావ్మతి విశ్రాంతిగృహంలో కమిటీ సభ్యులతో తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమావేశమయ్యారు. ఇందులో శ్రీవారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాల నిర్వహణ, తిరుమలలో భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ, పారిశుద్ధ్యం, ట్రస్టులు, పథకాలు, ధర్మప్రచార కార్యక్రమాలు, ఎస్వీబీసీ, గోశాల, వసతి కల్పన, నిఘా, భద్రతా వ్యవస్థ తదితర అంశాలను ఈవో వివరించారు.
అనంతరం తితిదే పరిపాలనా భవనంలోని నాణేల పరకామణి, ఖజానా విభాగాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. అంతకుముందు ఉదయం కమిటీ సభ్యులు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, పరకామణి, లడ్డూల తయారీ, లడ్డూ కౌంటర్లు, అన్నప్రసాద వితరణ, శ్రీవారి సేవా విధానం, శ్రీవారి సేవకుల కోసం నిర్మిస్తున్న నూతన భవనాలు పరిశీలించగా, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు వారికి అవసరమైన సమాచారాన్ని అందించారు. ఉన్నతస్థాయి కమిటీలో ఒడిశా అదనపు ముఖ్య కార్యదర్శి ఎస్.సి మహాపాత్ర, ఐజీ ఎస్.కె ప్రియదర్శి, జగన్నాథ ఆలయ కమిటీ సభ్యుడు ఎం.త్రిపాఠి ఉన్నారు.