ఆగస్టు 12 నుంచి 16వ తేదీ వరకు, తిరుమల దర్శనం ప్లాన్ చేసుకున్నారా ? అయితే, ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆ సమయంలో, పరిమితి స్థాయిలోనే, అతి తక్కువ మందికి మాత్రమే స్వామి వారి దర్శనం జరుగుతుంది. ఇవి వివరాలు... తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువును ఆగస్టు 12 నుంచి 16వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఐదు రోజుల పాటు శ్రీవారి ఆర్జిత సేవలన్నీ రద్దు చేస్తున్నామని తిరుమల జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు గురువారం విలేకరులకు తెలిపారు. ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని నిలిపివేశారు.
ఐదురోజుల పాటు పరిమిత సమయంలో కొద్దిమంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. రోజుకు 30 వేల మందికి మించి శ్రీవారి దర్శనం కల్పించే అవకాశాల్లేవని జేఈవో తెలిపారు. పన్నెండేళ్లకోసారి ఈ క్రతువును నిర్వహిస్తారని, శ్రీవారి ఆలయంతో పాటు అన్ని ఉపఆలయాల మహాసంప్రోక్షణ చేస్తారని అన్నారు. ఆగస్టు 11, 12 తేదీల్లో నిర్వహించే తోమాల, అర్చన సేవలకు ఉదయాస్తమాన సేవ భక్తులను మాత్రమే అనుమతిస్తారు. 16న ఉదయం మహాసంప్రోక్షణ జరుగుతుంది. చివరి రోజున యాగశాలలోని ఉత్సవమూర్తులను గర్భాలయంలోకి చేర్చడంతో వైదిక కార్యక్రమాలు సమాప్తమవుతాయి.
మహాసంప్రోక్షణలో భాగంగా శ్రీవారి మూలవిరాట్టు, ఇతర దేవతామూర్తుల శక్తిని బింబం నుంచి కుంభంలోకి ఆవాహనచేసి ఉపచారాలు, శాంతిహోమాలు నిర్వహిస్తామని ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. అష్టబంధనం అంటే ఎనిమిది రకాల వస్తువులతో తయారుచేసిన చూర్ణమని, దీని ఆయుర్దాయం 12 ఏళ్లు ఉంటుందని ఆగమ సలహాదారు సుందర వరదభట్టాచార్యులు వివరించారు. ఈ అష్టబంధనాన్ని శ్రీవారి పాదాల కింద ఉంచుతామన్నారు.