అమరావతి ఉద్యమం కేవలం, రెండు జిల్లాలకే, అది కూడా కేవలం ఒక కులానికే పరిమితం అంటూ, వైసీపీ ముందు నుంచి ప్రచారం చేసింది. పది మంది లేరు అని అవహేళన చేసారు. అయితే వందల సంఖ్యలో రైతులు రోడెక్కారు. పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఆగ్రహంతో వేలాదిగా మహిళలు రంగంలోకి దిగి కదం తొక్కారు. 4 గ్రామాల వారే ఉద్యమం చేస్తున్నారు అని నవ్వారు. వేలాదిగా విద్యార్థులు ఉద్యమానికి తోడై జాతీయ రహదారులను సైతం స్తంభించారు. 29 గ్రామాల్లో జరిగితే ఉద్యమమా?రైతు అనేవాడు గోచి కట్టుకొని నోరు మూసుకొని బురదలో ఉండాలి అని ఎద్దేవా చేసారు. 2 జిల్లాల ప్రజలు రోడ్ల పైకి వచ్చి సింహాల్లా గర్జించారు. డ్రామా కంపెనీ వాళ్లు రోడ్ల పైకి వచ్చారు అంటూ కించపర్చారు. 4 జిల్లాలో ఉద్యమం పురుడు పోసుకొని అమరావతి కోసం గొంతు విప్పుతున్నారు. వాళ్లంతా రైతులు కాదు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంటూ అరవడం మొదలు పెట్టారు. 13 జిల్లాలో మాకు వద్దు ఈ మూడు రాజాధానులు,ముప్పై రాజధానులు అంటూ సకల జనులు నినదిస్తున్నారు.
మహిళల్ని రోడ్ల పై ఈడ్చుకెళ్ళి,లాఠీ ఛార్జ్ చేసి సాయంత్రం ఆరు దాటిన తరువాత కూడా స్టేషన్ లో నిర్బంధించారు. అనారోగ్యంతో చస్తే ఉద్యమం కోసం చనిపోయారు అని బిల్డ్ అప్ ఇస్తున్నారు అని అన్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం ,అమరావతి ని సాధిస్తాం అని రైతులు ,మహిళలు ,విద్యార్థులు అనే పరిస్థితి తెచ్చారు. ఇప్పుడు రాయలసీమలో కూడా ఇది కళ్ళారా చూసే పరిస్థితి వచ్చింది. ఈ రోజు అమరావతి జేఏసీ తరుపున, చిత్తూరు జిల్లా తిరుపతిలో పెద్ద ర్యాలీ జరిగింది. ఇందులో చంద్రబాబుతో పాటుగా, ఇతర పార్టీ నేతలు పాల్గున్నారు. ఉదయం నుంచి అనేక నిర్బంధాలు చేసారు. ర్యాలీకి పర్మిషన్ లేదు అంటూ, ఎక్కడికక్కడ నేతలను హౌస్ అరెస్ట్ చేసారు. పోలీసులు అనేక ఆంక్షలు పెట్టరు.
చివరకు చంద్రబాబు తిరుపతిలో అడుగు పెట్టటంతో, ఇక తప్పక షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. అయితే, ఈ రోజు ర్యాలీకి, మచిలీపట్నం, రాజమండ్రి కంటే ఎక్కువ మంది ప్రజలు వచ్చారు. రాయలసీమలో, అమరావతికి వచ్చిన ఈ రెస్పాన్స్ చూసి, వైసీపీలో కలవరం మొదలైంది. అమరావతి పై ఎంత వ్యతిరేకత తీసుకువద్దాం అని ప్రయత్నం చేసినా, తమకు ఎంతో బలం ఉన్న రాయలసీమలో, ప్రజలు ఒకే రాజధానికి మద్దతు తెలపటం పై, వైసీపీలో అంతర్మధనం మొదలైంది. రాయలసీమ ప్రజలు మద్దతు పలకటం పై చంద్రబాబు ట్వీట్ చేసారు... "ఉదయం నుంచి తిరుపతిలో హౌస్ అరెస్ట్ లు చేసారు. ప్రజలని నిర్బంధించారు. అడుగడుగునా ఆంక్షలు పెట్టారు. నిర్బంధాలు దాటుకుని రాజధాని అమరావతి పరిరక్షణ కోసం జేఏసీ ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన ర్యాలీలో భారీ ఎత్తున హాజరై సంఘీభావం చెప్పారు చిత్తూరు జిల్లా ప్రజలు. రాయలసీమ నినదిస్తోంది 'జై అమరావతి' అని, 'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని' అని!" అంటూ చంద్రబాబు ట్వీట్ చేసారు.