శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు వద్ద పెను తుపాను తిత్లీ తీరాన్ని తాకింది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న పెను తుపాను మరింత ముందుకు కదిలి ఒడిశా పశ్చిమ బెంగాల్ వైపు దిశమార్చుకుంటుందని వాతావరణశాఖ తెలియచేసింది. తుపాను తీరాన్ని దాటుతున్న సమయంలో వజ్రపుకొత్తూరు, సోంపేట, తదితర మండలాల్లో గాలులు, వర్షభీభత్సం కొనసాగుతోంది. కుండపోతగా వర్షం కురుస్తుండటంతో పాటు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సైక్లోన్ ఐ గా పిలిచే తుపాను కేంద్రకం దాదాపు 52 కిలోమీటర్లమేర విస్తరించి ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
తుపానులో అంతర్గతంగా గాలుల వేగం 155 నుంచి 187 కిలోమీటర్ల వరకూ ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 2 కిలోమీటర్ల ఎత్తున్న ఈ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో చాలా చోట్ల భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. పెనుతుపాను తీరం దాటుతున్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు ఒడిశాలోని గజపతి, గంజాం, ఖుర్దా, నయాగడ్ పూరి, జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం పోర్టుల్లో 10వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తుపాను తీరాన్ని దాటే సమయంలో అలలు 3 మీటర్ల మేర ఎగసిపడతున్నట్టు ఇన్‌కాయిస్ హెచ్చరికలు జారీ చేసింది.
తుపాను కారణంగా ఖుర్దా రోడ్-విజయనగరం మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. 53 కిలోమీటర్ల మేర తుపాను కేంద్రం విస్తరించి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల కాల్ సెంటర్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎస్సెమ్మెస్‌ల ద్వారా వరద హెచ్చరిక సందేశాలు పంపిస్తోంది. సహాయం కోసం 1100 నంబరుకు కాల్ చేయాలని అధికారులు కోరారు. విజయనగరంలోని కలెక్టరేట్‌లో కంట్రోల్ రూము ఏర్పాటు చేశారు. 08922 236947, టోల్ ఫ్రీ నంబరు 1077కు ఫోన్ చేసి సాయం కోరవచ్చు. విశాఖ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కాల్ సెంటరు నంబరు 1800 4250 0002.