తిత్లీ తుపాను సహాయం కింద కేంద్రం ఇప్పటి వరకూ పైసా కూడా విడుదల చేయలేదని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. నిబంధనల మేరకు రాష్ట్ర విపత్తు సహాయ నిధి కింద రెండో కిస్తును మాత్రమే విడుదల చేసిందని వివరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో తాజాగా కేంద్రం విడుదల చేసిన నిధులపై ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం వివరణ ఇచ్చింది. ఆర్థిక సంఘం ప్రతిపాదన మేరకు రాష్ట్రానికి విపత్తు సహాయ నిధికి కేంద్రం ఇవ్వాల్సిన మొత్తంలో గత ఆగస్టులో 190 కోట్ల రూపాయలు విడుదల చేసింది. తాజాగా 229 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆర్థిక సంఘం ప్రతి సంవత్సరం రాష్ట్ర విపత్తుల సహాయ నిధికి కేటాయించాల్సిన నిధుల మొత్తాన్ని ప్రతిపాదిస్తుంది.
అందులో 75 శాతాన్ని కేంద్రం ఇస్తుంది. మిగిలిన 25 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సమకూరుస్తుంది. ఇందులో భాగంగానే 2018-19 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సంఘం రాష్ట్రానికి 509 కోట్ల రూపాయలు ఈ నిధి కింద ప్రతిపాదించింది. ఇందులో భాగంగానే రెండో కిస్తు కింద 229 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. తుపాను సహాయక చర్యల కోసం నిధులు కేటాయించాలని కేంద్రాన్ని గత నెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరిన తరువాతే విపత్తు సహాయ నిధికి కేంద్రం తన వాటాను విడుదల చేసిందని గుర్తుచేసింది. తిత్లీ తుపాను బాధితుల కోసం ప్రత్యేక సాయంగా ఇచ్చింది కాదు. ఇవి ఎవరి పోరాటంతోనే వచ్చిన నిధులు కావని, రాజ్యాంగ ప్రకారం వచ్చాయని స్పష్టం చేసింది. గతంలో ఏ ప్రధాని ఇంత నిర్దయగా ప్రవర్తించలేదని విమర్శించింది
శ్రీకాకుళం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలకు నిధులు విడుదల చేయాలని కేంద్రానికి ఇప్పటికే ముఖ్యమంత్రి రెండు సార్లు లేఖ రాశారు. దానికి కేంద్రం స్పందించలేదు. తాజాగా విడుదలైన నిధులు తుపాను సహాయక చర్యలు చేపట్టేందుకు ఇచ్చిన నిధులు కావని తెలిపింది. తిత్లీ తుపాను వల్ల 3673 కోట్ల రూపాయల మేర నష్టం వాటల్లిందని కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి వివరించడం తెలిసిందే. ప్రకృతి విపత్తుల సమయంలో ఏ ప్రధాని కూడా రాష్ట్రం పట్ల ఇంత కనికరం లేకుండా వ్యవహరించలేదని ముఖ్యమంత్రి ఆక్షేపించడం తెలిసిందే. హుదూద్ తుపాను సమయంలో 1000 కోట్ల సాయం ప్రకటించి, 600 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు.