ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వీహెచ్‌పీ మాజీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీతో తనకు 43 ఏళ్లుగా స్నేహం ఉందనీ... అయినా ఎప్పుడూ ఆయన చాయ్ అమ్మడం చూడనేలేదని పేర్కొన్నారు. కేవలం ప్రజల సానుభూతి కోసమే ప్రధానమంత్రి ‘చాయ్ వాలా’ ఇమేజిని వాడుకుంటున్నారంటూ విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్‌కు నాయకత్వం వహిస్తున్న తొగాడియా... బీజేపీ, ఆరెస్సెస్‌లకు రామమందిర నిర్మించాలన్న ఉద్దేశమే లేదంటూ విమర్శించారు. ‘‘ప్రధాని మోదీ ప్రకటన చేసిన తర్వాత ఆరెస్సెస్ నాయకుడు భయ్యాజీ జోషి సైతం వచ్చే ఐదేళ్లలో కూడా రామాలయం నిర్మాణం కాదని స్పష్టం చేసేశారు.
ఈ రెండు గ్రూపులు (బీజేపీ, ఆరెస్సెస్) మొత్తం 125 కోట్ల మంది భారతీయులను భ్రమల్లో ఉంచారు. కానీ ఇప్పుడు దేశంలోని హిందువులంతా మేల్కొన్నారు...’’ అని పేర్కొన్నారు. వచ్చేనెల 9న హిందువుల కోసం కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నామనీ.. ఒక్కసారి పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధిస్తే మరుసటి రోజే రామాలయం నిర్మిస్తామని తొగాడియా వెల్లడించారు. రామాలయంపై ఆర్డినెన్స్ తేవకపోవడంపైనా ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యంగా ఆయన విమర్శలు సంధించారు. ‘‘పార్లమెంటులో ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చేందుకు అర్థరాత్రి కూడా అని కూడా చూడకుండా పనిచేస్తారు.
కానీ ఆలయ నిర్మాణాన్ని ఆ మాత్రం కూడా పట్టించుకోరు...’’ అని తొగాడియా పేర్కొన్నారు. ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చినా రామాలయం నిర్మించరనీ... బీజేపీ, ఆరెస్సెస్‌కు రామాలయం వివాదమే ప్రాణాధారమని ఆయన పేర్కొన్నారు. ఒక్కసారి రామాలయం వివాదం పరిష్కారం అయిపోతే ఈ రెండు సంస్థలకు ముందు ముందు పని ఉండదనీ.. అక్కడితోనే కుప్పకూలిపోతాయన్నారు. అందుకే ఆలయ నిర్మాణం జరగకుండా ఆ సమస్యను సజీవంగానే ఉంచుతున్నాయని దుయ్యబట్టారు.