బీజేపీ ఏపీ లో అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగానూ 123చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల ఒక ఆంగ్ల టీవీ స్టింగ్ ఆపరేషన్‌లో బ యట పడిన విధంగానే చంద్రబాబుపై పోటీకి అభ్యర్థిని రంగంలోకి దించిన బీజేపీ.. పులివెందులలో మాత్రం తన రహస్య మిత్రుడికి మద్దతిచ్చింది. కుప్పంలో ఎన్.ఎస్. తులసీనాథ్ అనే వ్యక్తిని పోటీకి దించింది. పులివెందులలో ఎవరి పేరూ ప్రకటించలేదు. 2014లో విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విష్ణుకుమార్‌రాజుకు మరోసారి టిక్కెట్ కేటాయించిన బీజేపీ నాయకత్వం.. సిటింగ్ ఎమ్మెల్యే మాణిక్యాలరావుకు టిక్కెట్ కేటాయించలేదు. దీంతో మాణిక్యాలరావు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది.
బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఎన్నికల బరినుంచి తప్పుకోవడంతో కైకలూరులోనూ ఎవ్వరినీ బరిలో దించలేదు. శనివారం పార్టీలో చేరిన కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే జయరాములుకు అదేస్థానం నుం చి పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నలిచ్చింది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ తమకు టిక్కెట్ కేటాయించలేదని అసంతృ ప్తి వ్యక్తం చేస్తోన్న మంగళగిరి చేనేత సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు జగ్గారపు రామ్మోహన్‌రావును అక్కడి నుంచి బరి లో దించింది. అయితే అదే జిల్లా గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేస్తారనుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరు జాబితాలో లేదు.
ఆయన స్థానం నుంచి సినీనటి పసుపులేటి లతా మాధవికి టికెట్ ఇచ్చారు. మాధవీలత అసలు పేరు పసుపులేటి మాధవి. ఆమె కర్ణాటకలోని బళ్లారిలో ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు. అక్కడే ఉన్నత విద్యాభ్యాసం చేసిన అనంతరం టాలీవుడ్ లో ప్రవేశించి అనేక చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. పెదకూరపాడు స్థానం ఖాళీగా ఉంచడంతో కన్నా అక్కడి నుంచి బరిలో దిగే అవకాశాలున్నాయి. కాగా, రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాతో శుక్రవారం కన్నా లక్ష్మీనారాయణ బృందం ఢిల్లీకి వెళ్లింది. శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో సమావేశమైన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ 123 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.