ప్రతి ఆరు నెలలకు ఎదో ఒకటి చేసి, అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెట్టటం, కేంద్రానికి అలవాటు అయిపొయింది. నోట్లు రద్దు, ఏటిఎం కష్టాలు, జీఎస్టీ, పెట్రోల్ రేట్లు, ధరల పెరుగుదల, ఇలా ప్రతి ఆరు నెలలకు, సామాన్యులను ఇబ్బంది పెడుతున్న కేంద్రం, ఇప్పుడు సామాన్య ప్రజలు వాడే కేబుల్ టీవీ పై పడింది. ట్రాయ్ కొత్త నిబంధనల పేరుతొ, బుల్లితెర వినోదం ఇకపై మరింత భారం కానుంది. కొత్తగా ట్రాయ్‌ రూపొందించిన టారిఫ్‌ ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. అంటే ప్రస్తుతం ప్రసారమవుతున్న ఫ్రీ చానెల్స్‌ బుధవారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి. ఇకపై వినియోగదారుడు నచ్చిన చానెల్స్‌ను కొంత మొత్తం చెల్లించి చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు వందల సంఖ్యలో వస్తున్న ఫ్రీ ఎయిర్‌ చానెల్స్‌కు కూడా నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

trai 06022019

ఫ్రీ టూ ఎయిర్‌ చానెల్స్‌ ప్రసారాలన్నీ బుధవారం అర్ధరాత్రి నుంచి బంద్‌ కానున్నాయి. ఇకపై వీటికి నెట్‌వర్క్‌ కెపాసిటీ ఫీజు (ఎన్‌సీఎఫ్‌) కింద నెలకు రూ.130, ట్యాక్స్‌ రూ.24 కలిపి మొత్తం రూ.154 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని చెల్లించిన వినియోగదారుడు ఫ్రీ టూ ఎయిర్‌లో వుండే 300 చానెల్స్‌లో నచ్చిన వంద చానెల్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఫ్రీ ఎయిర్‌లో వుండే ఇతర ఏ ఒక్క చానెల్‌ను చూడాలన్నా వినియోగదారుడు రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే తనకు నచ్చిన ఒక చానెల్‌తోపాటు మరో 24 చానెల్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతం సగటు తెలుగు టీవీ ప్రేక్షకుడు చూసే ప్రధాన చానెల్స్‌లో ఒక్కటి కూడా ఫ్రీ టూ ఎయిర్‌లో లేవని తెలుస్తోంది. 300 చానెల్స్‌లో 26 డీడీ చానెల్స్‌, ఇతర చానెల్స్‌ వున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ప్రధాన చానెల్స్‌ అన్నీ పే చానెల్స్‌లో పెట్టడం వల్ల వినియోగదారుడిపై మరింత భారం పడనున్నది.

trai 06022019

పే చానెల్స్‌ను అర్ధరూపాయి నుంచి రూ.19కి మించకుండా వినియోగదారుడికి అందించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే ఆయా కంపెనీలన్నీ రూ.19కే ఇస్తున్నాయి తప్ప కనిష్ఠంగా పేర్కొన్న అర్ధరూపాయిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. పైగా కొన్ని చానెల్స్‌ సిండికేట్‌గా ఏర్పడి ప్యాకేజీల రూపంలో అందించే ప్రయత్నాన్ని చేస్తున్నాయి. దీనివల్ల ప్రస్తుతం సగటు టీవీ ప్రేక్షకుడు రూ.150 నుంచి రూ.250 చెల్లించి వందల చానెల్స్‌ను చూస్తుంటే, ఇకపై రెట్టింపు చెల్లిస్తేగానీ ప్రస్తుతం చూస్తున్న చానెల్స్‌ చూడలేని పరిస్థితి. ప్రస్తుతం ట్రాయ్‌ తీసుకువచ్చిన కొత్త నిబంధనలతో వినియోగదారుడు చెల్లించే మొత్తంలో 80 శాతం బ్రాడ్‌కాస్టర్‌కు, 20 శాతం ఎంఎస్‌వో, లోకల్‌ కేబుల్‌ ఆపరేటర్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆయా చానెల్స్‌లో వచ్చే ప్రకటనల ఆదాయంలోను బ్రాడ్‌ కాస్టర్స్‌కు కొంత వాటా వస్తుంది. అంతిమంగా ట్రాయ్‌ తీసుకువచ్చిన కొత్త నిబంధనల వల్ల వినియోగదారుడిపై భారం పడనుండగా, బ్రాడ్‌కాస్టర్స్‌కు ప్రయోజనం చేకూర్చ నున్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. పే చానెల్స్‌లో ప్రకటనలు వున్న వాటిని వినియోగదారుడికి రూ.19కి ఇవ్వాలని, ప్రకటనలు లేని చానెల్స్‌ను అర్ధ రూపాయికి ఇవ్వాలని వినియోగదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read