ఇది వినటానికి వింతగా ఉన్నా, ఇది నిజం... ఢిల్లీ నగర వీధుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని జేజేలు పలుకుతుంటే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై, విమర్శలు వస్తున్నాయి... సమాజంలో వివక్షకు గురవుతున్న హిజ్రాల పై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవతా కోణంలో ఆదుకుంటుంది... వివిధ వర్గాల ప్రజలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి కృషి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు హిజ్రాలపై దృష్టి సారించింది... ఇదే సందర్భంలో కేంద్రం ప్రవేశపెట్టనున్న ట్రాన్స్‌జెండర్ 2016 బిల్లును వ్యతిరేకిస్తూ ఇవాళ హిజ్రాలు పార్లమెంటు స్ట్రీట్‌లో ధర్నాచేశారు.
ట్రాన్స్‌జెండర్ బిల్లు వ్యతిరేకిస్తూ ఏపీ తెలంగాణ నుంచి ఢిల్లీ వచ్చిన వందలాది హిజ్రాలు ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం హిజ్రాల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ప్రభుత్వ తీరు వారు ఖండించారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తరహాలో తెలంగాణ ప్రభుత్వం హిజ్రాలకు ఉద్యోగ అవకాశాలు జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. హిజ్రాల జీవన శైలి పట్టించుకోకుండా కేంద్రం, ట్రాన్స్‌జెండర్ బిల్లు తయారు చేశారంటూ వారు వాపోయారు. హిజ్రాలకు విద్య, ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. హిజ్రాల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా బిల్లు రూపొందించారని, బిల్లు వల్ల తాము నష్టపోతామని స్నేహ, రేష్మ, దుర్గ అనే హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు.
తాము పడుతున్న సమస్యలపై చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారని పొగడ్తలు గుప్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు ఏపీలో సొంత గృహలను కూడా నిర్మించారని గుర్తుచేశారు. ఏ రాష్ట్ర కూడా తమకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా న్యాయం చేయాలని స్నేహ, రేష్మ, దుర్గ విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్‌జెండర్ పాలసీకి ఏపీ కేబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. 18 ఏళ్లు పైబడిన ట్రాన్స్‌జెండర్లకు రూ. 1500 పెన్షన్ ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని తీర్మానం చేశారు. అంతేకాకుండా ఉపాధికల్పన కోసం వారికి నైపుణ్య శిక్షణ ఇప్పించాలని కేబినెట్ తీర్మానించింది.