ఎలా అయినా చంద్రబాబు పై అవినీతి ముద్ర వెయ్యాలి అని చూస్తున్న జగన్ మోహన్ రెడ్డి, ముందుగా ఆనాడు చంద్రబాబు హయంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలు పై సమీక్ష చేసి, ఎదో జరిగింది అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం ఇందుకు ససేమీరా అంటుంది. ధరలు నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సంబంధం ఉండదని, రెగ్యులేటరీ పరిధిలోనే మొత్తం నిర్ణయాలు జరుగుతాయని, మీరు అవగాహన లేక చేసే పనుల వల్ల పెట్టుబడి దారులు వెళ్లిపోతారని, ఒకటికి రెండు సార్లు కేంద్రం జగన్ మోహన్ రెడ్డికి లేఖలు రాసింది. అయినా సరే చంద్రబాబుని ఎదో ఒక విధంగా ఇరికించాలని, జగన్ మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ఇందుకోసం ఒక కమిటీ వేసి పనులు మొదలు పెట్టారు.
అనంతపురం జిల్లాలో చంద్రబాబు గ్రీన్ కో కంపెనీకి ఇచ్చిన ఒప్పందం పై నోటీసులు ఇచ్చారు. దీని పై ఆ కంపెనీకి ట్రిబ్యునల్ కు వెళ్ళటంతో, ఈ రోజు ట్రిబ్యునల్ ప్రభుత్వం నిర్ణయం పై స్టే ఇచ్చింది. చంద్రబాబు పై ఎలా అయినా అవినీతి ముద్ర వెయ్యాలని దూకుడుగా వెళ్తున్న జగన్ కు ఇది షాక్ అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ కో కంపెనీకి నోటీసులు ఇవ్వటంతో, ఆ కంపెనీ ట్రిబ్యునల్ కు వెళ్ళటంతో, ట్రిబ్యునల్, ప్రభుత్వ నోటీసుల పై స్టే ఇచ్చింది. యూనిట్ ధర రూ.4.50 నుంచి, రూ.2.44కి తగ్గించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గ్రీన్ కో కంపెనీని నోటీసులు ఇచ్చింది. ఇలా అయితేనే కొనసాగిస్తాం అన్న విధంగా, బెదిరింపులకు దిగటంతో, గ్రీన్ కో కంపెనీ అడ్డం తిరిగింది. అసలు ధరలు నియంత్రించటం మీ పరిధిలోకి రాదని, రాష్ట్రంతో వాదించింది.
ధరలు నిర్ణయం తీసుకునేది, రెగ్యులేటరీ అథారిటీ అని, మీకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. అయితే, రాజస్తాన్ లో గ్రీన్ కో కంపెనీ, యూనిట్ ధర రూ.2.44కే ఇస్తుందని, ఇక్కడ కూడా అదే రేట్ కు ఇవ్వాలని ప్రభుత్వం వాదించింది. అయితే అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ కు, ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ కు తేడా ఉంటుందని, సూర్య కిరణాలు బట్టి తేడా వస్తుందని, అక్కడ రేట్ కు ఇక్కడ ఇవ్వలేమని గ్రీన్ కో తేల్చి చెప్పింది. అయినా సరే, అదే రేట్ కు ఇవ్వాలని, గ్రీన్ కో కు చెందిన మూడు కంపెనీలకు, జూలై 12న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అయితే, ఈ నోటీసుల పై ఈ రోజు ట్రిబ్యునల్ తప్పుబట్టింది. దీని పై స్టే విధించింది. నిన్న చంద్రబాబు కూడా ఇదే విషయం చెప్పిన సంగతి తెలిసిందే. పక్కన ఉన్న కర్ణాటకలో జగన్ కు చెందినా సండుర్ కంపెనీ యూనిట్ ధర 4.50 కి తీసుకుంటూ ఇక్కడ కుదరదు అని వాదిస్తున్నారని చెప్పారు.