తమ నిర్ణయం పై వెనక్కు తగ్గేది లేదు అంటూ, జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే, కేంద్ర ప్రభుత్వం, కోర్ట్ లు, ట్రిబ్యునల్ లు మాత్రం, జగన్ దూకుడికి బ్రేక్ లు వేస్తున్నాయి. విద్యుత్ ఒప్పందాల సమీక్ష విషయంలో, అటు కోర్ట్ లు, ఇటు కేంద్రం, చివరకు విదేశీ ప్రభుత్వాలు కూడా జగన్ వైఖరిని తాప్పుబడుతున్న సంగతి తెలిసిందే. తాజగా, విండ్, సోలార్ ఎనర్జీ కొనుగోలు ఒప్పందాల విషయంలో, గత ప్రభుత్వం చేసిన పీపీఏలను రద్దు చెయ్యాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విద్యుత్ అప్పిలేట్ ట్రైబ్యునల్ ఈ రోజు షాక్ ఇచ్చింది. విద్యుత్ ఒప్పందాల రద్దు కుదరదు అని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహించాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది. పాత ఒప్పందాలనే కొనసాగించాలని ట్రైబ్యునల్ ఆదేశించింది.
గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాల సమీక్షించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదే విషయం పై సోలార్, విండ్ ఎనర్జీ కంపెనీలకు నోటీసులు కూడా జారీ చేసింది. దీని పై కడప, అనంతపురానికి చెందిన మూడు విద్యుత్ కంపెనీలు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాయి. ఇప్పటికే జరిగిన విద్యుత్ పీపీఏలపై సమీక్షించడం వలన తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, భవిష్యత్‌లో అనేక పరిణామాలు ఎదుర్కోవాలని కంపెనీలు, ట్రిబ్యునల్ కు చెప్పాయి. పీపీఏలపై సమీక్షించడమంటే, తమ పై ప్రభుత్వానికి నమ్మకం లేకపోవడమేనని ట్రైబ్యునల్ ముందు ఈ కంపెనీలు వాదనలు వినిపించాయి. గత రెండు నెలలుగా ఈ వాదనలు సాగాయి. అందరి వాదనలు విన్న ట్రైబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది
విద్యుత్ ఒప్పందాల పీపీఏలపై సమీక్ష చెయ్యటం కాని, రద్దు చెయ్యటం కాని, చెయ్యకూడదు అని, అవి ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అలాగే ఈ విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం చేపట్ట తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణ అంశం కూడా అవసరం లేదని స్పష్టంచేసింది. ఇప్పటికే చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను కొనసాగించాలని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఇదే అంశం పై ఇప్పటికే హైకోర్ట్ కూడా జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. అదే విధంగా కేంద్రం కూడా, విద్యుత్ ఒప్పందాల సమీక్ష వద్దని, ఇలా చేస్తే, దేశం మొత్తానికి పెట్టుబడుల పై ప్రభావం ఉంటుందని కేంద్రం హెచ్చరించింది. ఇక జపాన్ ప్రభుత్వం కూడా, జగన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది.