ఎన్నికల నగారా మోగడంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై టీఆర్ఎస్ పెత్తనం చేసేందుకు రెడీ అవుతుందా ? అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే సమాధానమిస్తున్నాయి. తాజగా ఏపీలో ఎన్న టీఆర్ఎస్ కార్యకర్త కొణిజేటి ఆదినారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పోటీకి సిద్దమన్నారు. రాజధాని ప్రాంతమైన సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి ఆయన సై అన్నారు. అంతేకాదు టీఆర్ఎస్ బీఫామ్ కోసం కొణిజేటి హైదరాబాద్‌కు కూడా పయనమయ్యారు. ఏపీలో టీఆర్ఎస్ పార్టీ తరపున గెలుపొంది... తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు గిఫ్ట్ ఇస్తామంటున్నారు కొణిజేటి ఆదినారాయణ.
టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు విజయవాడకు చెందిన కొణిజేటి ఆదినారాయణ తెలిపారు. ఆదినారాయణ తొలినుంచి కేసీఆర్‌కు వీరాభిమాని. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించాలని ఇంద్రకీలాద్రి వద్ద 101 కొబ్బరికాయలతో మొక్కు తీర్చుకున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మోకాళ్లపై ఇంద్రకీలాద్రి ఎక్కారు. తాజాగా ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఆదినారాయణ విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని అధిష్ఠానానికి తెలిపానని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి కేటీఆర్‌ను తీసుకొస్తాననీ, తెలంగాణ ఎంపీ అభ్యర్థులతోపాటే తానూ కేసీఆర్ నుంచి బీఫారం తీసుకుంటానని ఆదినారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఏపీలో టీఆర్ఎస్ గనుక ఎన్నికల రంగంలోకి దిగితే... రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఇటు ఏపీ ఎన్నికలకు.. అటు తెలంగాణలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు అతితక్కువ సమయం మాత్రమే ఉంది. దీంతో అధికార పార్టీలు అనేక వ్యవహారాల్లో తలమునకలై ఉన్నాయి. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఏపీలో పోటీకి దిగే అవకాశాలు లేవని చెబుతున్నారు. మరి కొణిజేటి ప్రతిపాదనపై టీఆర్ఎస్ అధిష్టానం... ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలంటే ఇంకాస్త సమయం ఆగాల్సిందే.