ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావిడి చేసి, మోడీ ఫ్రంట్ లో చేరిన కెసిఆర్ పార్టీ, అసలు రంగులు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అవిశ్వాస తీర్మానం పై సపోర్ట్ ఇవ్వని టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు మరింత ముందుకెళ్ళింది. కేంద్రం నుంచి ఏపీ ప్రత్యేక ప్రోత్సాహకాలు కోరితే తాము వ్యతిరేకిస్తామని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష ఉపనేత బి.వినోద్‌కుమార్ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా అన్నది విభజన చట్టంలో లేదని, బీజేపీ చెప్పిన మాటలే చెప్పారు. దేశంలో ఎక్కడా లేనిదానిని కోరడమేంటని ప్రశ్నించారు. ఏపీ ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని, హైదరాబాద్ పరిశ్రమలు విజయవాడకు తరలివెళ్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
2014లో తమిళనాడు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత కూడా ఇదే అంశంపై కేంద్రానికి లేఖ రాశారని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని కోరారని తెలిపారు. కేంద్రంపై అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని టీడీపీ తమను డిమాండ్ చేయడం అర్ధరహితమని, అన్నారు. అవిశ్వాసం పై చర్చను తెలంగాణ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటామన్నారు. అయినా అవిశ్వాసం అంశం ఓటింగ్‌కు వస్తుందని అనుకోవడం లేదని, ఒకవేళ వస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో అవిశ్వాసం కోసం, తెలుగుదేశం పట్టుబడుతుంటే తెరాస యంపీ కవిత ఆంధ్ర ఎంపీలకు మద్దతు ఇచ్చారు. అవిశ్వాసం పై చర్చ జరిగే స్థితి లేదు కాబట్టి ఆరోజున వారు మద్దతు ప్రకటించారు. కానీ అవిశ్వాసం పై చర్చ మొదలు సమయాన తెరాస తన అసలు రంగు బయటపెట్టింది.
కవిత మద్దతు తెలపటంతో, అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా, "చెల్లెలు కవిత గారికి ధన్యవాదాలు అంటూ" ట్వీట్ కూడా చేసారు. మరి ఇప్పుడు తెరాస చేస్తున్న దాని పై, తెలంగాణలో ఉంటున్న పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించరో ఆయనకే తెలియాలి. ఇది ఇలా ఉంటే, కెసిఆర్ చేస్తుంది మాత్రం ద్రోహం. సాటి తెలుగు రాష్ట్రం కష్టాల్లో ఉంటే, కలిసి పోరాడతా అని మాట ఇచ్చి, బీజేపీకి ఎదురు తిరుగుతునట్టు ప్రకటించి, ఫెడరల్ ఫ్రంట్ నాటకాలు ఆడి, ఇప్పుడు అమిత్ షా పక్కనే చేరారు. కెసిఆర్ గారికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విలువ తెలియక పోవచ్చు. కాని, ఎన్నికల సమయంలో, హైదరబాద్ ఓట్ల కోసం, ఆంధ్రా వారు కావలి కదా, అప్పుడు మాట్లాడుకుందాం. కర్ణాటక పరిణామాలు గుర్తుండే ఉంటాయి.