భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ అనుచిత వ్యాఖ్య చేశారు. మోదీకి సంబంధాలు చూడడానికి తాను సిద్ధమని పేర్కొన్నారు. అలా ఎందుకు అన్నారని అనిపిస్తోంది కదా. గత ఏడాది మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన సందర్భంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారట. ఈ మేరకు పొలిటికో అనే పత్రిక 'దౌత్యపరమైన తప్పిదాలు' పేరిట ఓ కథనం ప్రచురించింది. అందులో ట్రంప్ దేశాధినేతలతో సమావేశాల సమయంలో చేసిన తప్పులు, టెలిఫోన్ సంభాషణలో పొరపాట్లు, ఉచ్చరణ లోపాలు, ఇబ్బందికర వ్యాఖ్యల గురించి రాశారు. ఈ కథనంలో ట్రంప్, మోదీపై వేసిన జోక్ గురించి కూడా వెల్లడించారు.
గత ఏడాది మోదీ వైట్‌హౌస్ పర్యటన నేపథ్యంలో ట్రంప్ ముందుగానే దక్షిణాసియా గురించి, మోదీ గురించి పలు విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారట. అయితే మోదీ ఒంటరిగా ఎందుకు వస్తున్నారు? ఆయన భార్యతో రావడం లేదా? అని ట్రంప్ అడగగా.. మోదీ భార్యతో కలిసి ఉండరని, ఎన్నో ఏళ్ల నుంచి విడిగా ఉంటున్నారని చెప్పారు. దీంతో వెంటనే ట్రంప్.. అయితే మోదీకి నేను సంబంధం చూస్తానని జోక్ చేశారట. ఈ విషయాన్ని ఆ సమయంలో ట్రంప్‌తో పాటు సమావేశంలో ఉన్న అధికారుల్లోని ఇద్దరు వ్యక్తులు వెల్లడించారని పొలిటికో తెలిపింది.
ట్రంప్ మోదీతో సమావేశానికి ముందే దక్షిణాసియా మ్యాప్ తెప్పించుకుని చూశారని పొలిటికో పేర్కొంది. దక్షిణాసియాలోని పలు దేశాల గురించి అప్పుడు అడిగి తెలుసుకున్నారని, అప్పటి వరకు ఆయన నేపాల్, భూటాన్ భారత్‌లో భాగమనే అనుకున్నారని తెలిపింది. అంతేకాదు, ట్రంప్‌కు వాటిని పలకడం రాలేదట. నేపాల్‌ను నిపుల్ అని, భూటాన్‌ను బుట్టాన్ అని పలికారని పొలిటికో తన కథనంలో వెల్లడించింది.