తిరుమల పై రోజుకి ఒక సంఘటన వెలుగులోకి వస్తుంది. ఎంతో పవిత్రంగా ఉండాల్సిన తిరుమలలో, ప్రతి విషయం వివాదాస్పదం అవుతుంది. మొన్నటికి మొన్న, తిరుమల వెళ్ళే బస్ టికెట్ల పై జేరసులాం యాత్ర ఉచితం అనే ప్రభుత్వ ప్రకటన ఉన్న టికెట్లు ఇచ్చారు. అదేమంటే చంద్రబాబు మీదకు తోసేసారు. నెల్లూరులో ఉండాల్సిన ఈ టికెట్లు, చంద్రబాబు చెప్తే తిరుమల వచ్చాయని చెప్పి, ప్రజలు ఎలా నమ్ముతారో అనికూడా లేకుండా ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ రోజు తిరుమల పై మరో షాకింగ్ న్యూస్ వినిపిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం, ట్రెజరీలో ఉన్న 5 కిలోల వెండి కిరీటం, రెండు బంగారం ఉంగరాలు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఏకంగా ట్రెజరీలో నుంచే, నగలు మాయం అవ్వటం పై, శ్రీవారి భక్తులు ఆశ్చర్యపోతున్నారు.
అయితే ఈ నగలు మాయం వెనుక, టీటీడీ ఏఈవో శ్రీనివాసులును బాధ్యత వహిస్తూ, ఆయన పై చర్యలు తీసుకుంది టిటిడి. ఆయన నిర్లక్షంగా వ్యవహరించటం వలనే, నగలు పోయాయి అని తేల్చి ఆయన్ను బాద్యుడిని చేసారు. మాయమైన ఆ మూడు ఆభరణాల విలువను అతని నెలవారీ జీతం నుంచి రికవరీ చేయాలని టిటిడి అధికారులు నిర్ణయించారు. అయితే టీటీడీ ఏఈవో శ్రీనివాసులు పై, ఎలాంటి ఆధారాలు లేకుండా, ఏకపక్షంగా చర్యలు తీసుకోవడంపై టిటిడి ఉద్యోగుల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరో పక్క, ఆ నగలు మాయం చేసిన వాళ్ళని పట్టుకుని, కఠిన చర్యలు తీసుకోకుండా, ఇలా కేవలం ఎవరినో బాధ్యత చూపుతూ, రికవరీ మాత్రమే చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆయన జీతం కేవలం 30 వేలు అని, ఆ ఆభరణాల విలువ, ఆయన జీతంలో ఎన్ని సంవత్సరాలు రికవరీ చేస్తారాని వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజు స్వామి వారికి, దాదపుగా, 290 ఆభరణాలతో అలంకరణ చేస్తారు. ఈ 290 భరణాలు తప్పితే, మిగతా బంగారం అంతా తిరుమల తిరుపతి దేవస్థానం, ట్రెజరీలో భద్రంగా ఉంచుతారు. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు, ఇక్కడ నుంచి నగలు తీసుకెళ్ళి అలంకరిస్తారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం, ట్రెజరీలో, 2012లో కూడా ఇలాగే నగలు మాయం అయ్యాయి. అప్పటి నుంచి, అక్కడ భద్రత పెంచి, సిసి కెమెరాలు ఏర్పాటు చేసి, పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే ఇంత భద్రత ఉన్నా కూడా, ఇలా నగలు ఎలా మాయం అయ్యయో, ఎవరికీ అర్ధం కావటం లేదు. అసలు దీని పై విచారణ జరపకుండా, కేవలం రికవరీ మాత్రం చెయ్యటం పై కూడా విమర్శలు వస్తున్నాయి.