సాక్షాత్తు కలియుగ దైవం వెంకన్న స్వామినే రాజకీయాల్లోకి లాగి, స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుంటూ, బీజేపీ నేతలను కలుస్తూ, తిరుమల పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న రమణ దీక్షితుల పై టీటీడీ పాలకమండలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీవారి ఆభరణాలు, కైంకర్యాలు, ఇతర అంశాలపై, నిరాధార ఆరోపణలకు కళ్లెం వేసి తీరాల్సిందేనని నిర్ణయించింది. ఆయనతోపాటు... ఆ ఆరోపణలను సమర్థిస్తూ మాట్లాడిన వ్యక్తులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. మంగళవారం తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. ‘‘రమణ దీక్షితులు ఆరోపణలపై నివేదికను రూపొందించి న్యాయ నిపుణుల సూచనలు కోరతాం. ఆయనతోపాటు టీటీడీపై విమర్శలు చేసిన వ్యక్తులకూ నోటీసులు జారీ చేస్తాం’’ అని తెలిపారు.
దీక్షితులుపై సుధాకర్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. ‘‘24 ఏళ్లుగా స్వామివారికి సేవలందించారు. అప్పుడు లేని అనుమానం ఈ రోజే ఎందుకొచ్చింది? నిజంగా తప్పు జరిగి ఉంటే ఆయన తిరుమలకు వచ్చి మాట్లాడాలి. మేమెక్కడికీ పారిపోలేదు. తప్పు జరిగినట్లయితే మాకు చూపించవచ్చు కదా! మేమూ మీవెంట వస్తాం. ఆలయంలో చూద్దాం రా! అది వదిలేసి హైదరాబాద్‌లో ఒకసారి ఢిల్లీలో ఒకసారి, చెన్నైలో ఒకసారి ఎవరి పోత్సాహంతోనో పూటకో మాట మాట్లాడుతున్నావు? భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికే ఇలా చేస్తున్నావ్! దేవునిపై దుష్ప్రచారం చేస్తున్నావ్! ఆ దేవుడే నీకు సరైన గుణపాఠం చెబుతాడు’’ అని హెచ్చరించారు.
మిరాశీ వ్యవస్థ రద్దయ్యాక టీటీడీ ఆధీనంలోకి వచ్చిన ఆభరణాల ప్రదర్శనను ఏర్పాటు చేసేందుకు బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించిందని ఈవో, చైర్మన్ తెలిపారు. ఈనెల 26న జరిగే సమావేశం సందర్భంగా బోర్డు సభ్యులకు ఆభరణాలను చూపిస్తామని తెలిపారు. గ్రామాలలో శ్రీవారి ఆలయాలు, రామాలయాలు నిర్మించడానికి అయ్యే అంచనా విలువను రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామన్నారు. ఇకపై ప్రవాస భారతీయ దాతలకు కూడా శ్రీవారి దర్శనం, బస, ఇతర సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. శ్రీవారి ఆలయ పవిత్రత, తితిదే ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వ్యక్తులకు లీగల్ నోటీసులు ఇవ్వాలని తీర్మానించారు. వెంటనే ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రసారమైన, ప్రచురితమైన వార్తలను పరిశీలించి పరువునష్టం కలిగించిన వ్యక్తులను గుర్తించాలని దేవస్థానం న్యాయవిభాగాన్ని ఆదేశించింది. లీగల్ నోటీసులు ఇచ్చి న్యాయపోరాటం చేయాలని, ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయరాదని కూడా నిర్ణయించింది. ఈ మేరకు నోటీసులు అందుకోనున్నవారిలో మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులతో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులు తెలిపారు.