'జగన్ కు ఉన్న ఆస్తలు ఏంటో నాకు తెలుసు. మాట తప్పను మడమ తిప్పను అని జగన్ పదే పదే సొంత డబ్బా కొట్టుంకుంటారు. కానీ వాస్తవానికి వస్తే మాట తప్పడం జగన్ స్థిరాస్తి, మడమ తిప్పడం జగన్ చరాస్తి' అని ఏపిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్.తులసిరెడ్డి మండిపడ్డారు. ఆంధ్రరత్నభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయన్నారు. సమైక్యవాదం, పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీల నుంచి సమైక్యవాదం ప్లకార్డులను తీసుకుని తమ సమైక్యవాది అని ప్రచారం చేసుకున్న జగన్ అదే వ్యక్తి 2012 డిసెంబర్ 28న తాను రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదని, అనుకూలమని అప్పటి కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఉత్తరం రాశారు. మిగతా దిన పత్రిక యాజమాన్యాలు పదే పదే ధరలు పెంచుతున్నారని, జగన్ మాత్రం సాక్షి దినపత్రిక ధరను పెంచనని ప్రకటించిన నెల రోజుల్లోపే ధరను పెంచడం.
బీజేపీకి ప్రత్యేక్షంగానీ, పరోక్షంగానీ మద్దతు ఇవ్వనని ప్రకటించిన తరువాత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో సాగిలపడి మద్దతు ఇవ్వడం. కాపు, తెలగ, బలిజ, ఒంటరి రిజర్వేషన్ల విషయంలో యూ టర్న్ తీసుకోవడం. 2018 ఆగస్టు 9వ తేదీన జరిగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన బి.కె. హరిప్రసాద్‌కు మద్దతు తెలపకుండా, ఓట్లు వేయకుండా ఉండటం ద్వారా వైకాపా నిజస్వరూపం బట్ట బయలైంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకి మద్దతిస్తామని, మేము మాట తప్పం, మడమ తిప్పమని వైకాపా నాయకులు పదే పదే చెబుతున్నా దానికి మొన్న రాజ్యసభలో ప్రవర్తించిన దానికి పూర్తి వైరాధ్యం ఉందన్నారు. ప్రత్యేకహోదా ఇస్తామని, విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేస్తామని కాంగ్రెస్ పదే పదే చెప్పడమే కాకుండా 2018 మార్చి 17, 18వ తేదీల్లో జరిగిన ఏఐసిసి 84వ ప్లీనరీలో, 2018 జూలై 22న జరిగిన సిడబ్ల్యు సి సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందని గుర్తు చేశారు.
కాబట్టి వైకాపా చెబుతున్నదాని ప్రకారమైతే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో వైకాపా రాజ్యసభ సభ్యలు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలి. కానీ వేయలేదు. దీనిని బట్టి వైకాపా దృష్టిలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా గానీ, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ గానీ, పోలవరం ప్రాజెక్టు, రాజధాని, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం, విశాఖ రైల్వే జోన్, దుగరాజ పట్నం ఓడరేవు, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, ఐఐటి లాంటి కేంద్రీయ సంస్థలు రాష్ట్రానికి అవసరం లేనట్లు స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కంటే వైకాపాకు, జగన్‌కు వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి నిరూపితమైందని, అందు కోసం వైకాపా అధినేత జగన్ ఎన్ని సార్లు అయినా మాట తప్పుతారు, ఎన్ని సార్లు అయినా మడమ తిప్పుతారని అన్నారు. జగన్ దృష్టిలో లౌక్యం అంటే లొంగిపోవడం, దౌత్యం అంటే దాసోహం, పోరాటం అంటే పారిపోవడమని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.