ప్రముఖ న్యూస్ చానల్ టీవీ9 సీఈఓ రవిప్రకాష్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఆయన నివాసంతో పాటు కార్యాలయంలోనూ కూడా తనిఖీలు చేస్తున్నారు. తన సంతకాన్ని రవిప్రకాష్ ఫోర్జరీ చేశాడని అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా నిధుల్ని కూడా ఆయన దారి మళ్లించారని అలంద మీడియా సంస్థ ఆరోపిస్తోంది.అలంద మీడియా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కొత్త డైరెక్టర్ల నియామకానికి రవి ప్రకాష్ అడ్డుతగులుతున్నారని కౌశిక్‌రావు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి టీవీ 9ను అలంద మీడియా టేకోవర్ చేసింది. కౌశిక్ రావు ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే రవి ప్రకాష్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే టీవీ 9 కార్యాలయంలోని కొన్ని కంప్యూటర్లను కూడా పరిశీలించినట్టు సమాచారం.
ఇది ఇలా ఉంటే, టీవీ9 సీఈవో పదవి నుంచి రవిప్రకాష్‌ను కొత్త యాజమాన్యం తొలగించినట్లు తెలిసింది. టీవీ9 సంస్థ నిర్వహణలో వైఫల్యం, సంస్థ కీలక ఉద్యోగి కౌశిక్ రావు సంతకం ఫోర్జరీ ఆరోపణలతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీవీ9లో 8శాతానికి పైగా వాటా ఉన్న రవిప్రకాష్ 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యాన్ని ఇబ్బందిపెడుతున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మెజారిటీ వాటాదారుల హక్కులను రవిప్రకాశ్ కాలరాస్తున్నారని కూడా కొత్త యాజమాన్యం ప్రధానంగా ఆరోపిస్తోంది. కొత్త డైరెక్టర్ల నియామకానికి కూడా రవిప్రకాష్ అడ్డుతగులుతున్నారని యాజమాన్యం ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే.. రవిప్రకాష్‌పై నిధుల మళ్లింపు ఆరోపణలు రావడం మీడియా వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
రవి ప్రకాష్‌పై సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పీఎస్‌లో ఫోర్జరీ కేసు నమోదైంది. ఐటీ యాక్ట్ 56, ఐపీసీ 406, 467 సెక్షన్ల కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాష్ కోసం రెండు రోజులుగా తెలంగాణ పోలీసుల గాలిస్తున్నట్లు తెలిసింది. రవిప్రకాష్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నట్లు సమాచారం. అందువల్లే టీవీ9 కార్యాలయంలోనూ, తన నివాసంలోనూ సైబర్ క్రైం పోలీసులు సోదాలు చేసిన సందర్భంలో రవిప్రకాష్ అందుబాటులో లేనట్లు తెలిసింది. కొత్త యాజమాన్యం కంపెనీ ఆర్థిక లావాదేవీలపై అంతర్గత విచారణ జరిపినట్టు తెలిసింది. భారత్ వర్ష్ ఛానల్స్ వ్యవహారంలో రవిప్రకాష్ కోట్లు దారి మళ్ళించినట్లుగా నిర్ధారణకు వచ్చిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.