ఈరోజు ఉదయం నుండి టీవీ9 రవి ప్రకాష్ కు సంబంధించి పలు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే అందరికీ షాక్ ఇస్తూ టీవీ9 స్టూడియోలో ప్రత్యక్షమయ్యారు రవి ప్రకాష్. ఈరోజు ఉదయం నుండి తెలుగు ప్రేక్షకులను, తెలుగు ప్రజానీకాన్ని గందరగోళానికి గురి చేస్తున్న వార్తలు వస్తున్నాయని.. రవి ప్రకాష్ రెండు రోజుల నుండి అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు, రవి ప్రకాష్ గురించి పోలీసులు వెతుకుతున్నారని, రవి ప్రకాష్ కోసం పోలీసులు వెతుకుతున్నారని, రవి ప్రకాష్ వేరే ఎవరిదో సంతకం ఫోర్జరీ చేశాడని వార్తలు వచ్చాయని, వేరే ఛానల్ కు నిధులు మళ్లించారని.. ఇలా ఎవరికి తోచినట్లు వార్తలు ప్రసారం చేశారని.. స్క్రోలింగ్ లు నడిపారని.. తన గురించి ఇంత ఆందోళన పడిన సాటి చానల్స్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాని రవి ప్రకాష్ చెప్పుకొచ్చారు. తాను టీవీ9 హెడ్ క్వార్టర్స్ బంజారాహిల్స్ నుండి మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు.
గత 15 సంవత్సరాలుగా తాను ఈ సంస్థలోనే పని చేస్తున్నానని.. పలు భాషల్లో తమ సంస్థ విజయకేతనాన్ని ఎగురవేసిందని చెప్పుకొచ్చారు. తన గురించి వస్తున్న వార్తల వలన చాలా మంది గందరగోళానికి గురయ్యారని రవి ప్రకాష్ లైవ్ లో చెప్పుకొచ్చారు. తనకూ, తమ సంస్థకూ ఫోన్ చేస్తున్నారని.. ఏమీ జరగడం లేదని..! ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఆ విషయం చెప్పడానికే తాను లైవ్ ఇస్తున్నానని రవి ప్రకాష్ చెప్పారు. కొన్ని ఛానల్స్ చేస్తున్న ప్రచారం నిజం కాదని.. అవాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని అన్నారు. ప్రస్తుతం ఎన్సీఎల్టీ కేసు నడుస్తోందని.. 16 వ తేదీ ఆ కేసు విచారణకు రానుందని రవి ప్రకాష్ చెప్పుకొచ్చారు. ఆ వివాదాన్ని తీసుకొని కొంతమంది తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారని రవి ప్రకాష్ చెప్పారు. తప్పుడు కేసులు నిలబడవు, అవాస్తవాలు నిలబడవు, సత్యం మాత్రమే నిలబడుతుంది అని ఆవేశంగా చెప్పుకొచ్చారు. తాను పారిపోయినట్లు వచ్చిన వార్తలు కూడా వాస్తవాలు కావని అన్నారు.
రవి ప్రకాష్ ను ఎవరూ అరెస్ట్ చేయలేదు.. అరెస్ట్ చేయబోవడం లేదు అని చెప్పారు.. కొందరు తప్పుడు కేసులు పెట్టాలని భావించారు.. అవి నిలబడవు అని ఆయన అన్నారు. గందరగోళాన్ని కాస్త తగ్గించడానికే ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నానని అన్నారు. టీవీ9 చానల్ నిర్వహణ తన ఇష్టారాజ్యంగా జరగాలన్న పంతంతో కొత్త యాజమాన్యానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ, చివరకి ఓ కీలక ఉద్యోగి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసే స్థాయికి దిగజారిన టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌ను ఆ సంస్థ సీఈవో పదవి నుంచి తొలగించాలని టీవీ9 యాజమాన్యం నిర్ణయం తీసుకుందన్నట్లు వార్తలు వచ్చాయి. కంపెనీలో 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యానికి ఆ కంపెనీ నిర్వహణలో అడుగడుగునా అడ్డుపడుతూ, కంపెనీల చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా రవిప్రకాష్ వ్యవహరిస్తున్నారని కొత్త యాజమాన్యం ఆరోపించినట్లు పలు ఛానళ్లు వార్తలు ప్రచారం చేశాయి. సంస్థ నిర్వహణకు సంబంధించి రవిప్రకాశ్ పాల్పడిన అక్రమాలపై టీవీ9 యాజమాన్యం అతనిపై చీటింగ్ కేసు పెట్టిందని వార్తలు ప్రసారం చేశారు.