విజయనగర మహారాజులు, త్యాగానికి పెట్టింది పేరు. వారు చేసిన త్యాగాలు ఇప్పటికీ చెప్పుకుంటూ, ఆ కుటుంబానికి గౌరవం ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలకు మంచి పేరు ఇప్పటికీ ఉంది. రాజకీయంగా ప్రత్యర్ధులు ఉన్నా, మాన్సాస్ జోలికి మాత్రం, ఇప్పటి వరకు ఎవరూ వెళ్ళలేదు. రాజశేఖర్ రెడ్డి కూడా, రాజకీయంగా ఎదురుకున్నారే కానీ, ఏ రోజు అశోక్ గజపతి రాజుని ఎదుర్కోవటానికి, మాన్సాస్ ని అడ్డు పెట్టుకోలేదు. ఈ నేపధ్యంలోనే 2019లో వైసిపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, మాన్సాస్ ని టార్గెట్ చేస్తూ వచ్చారు. మన్సాస్ చైర్మెన్ గా ఉన్న అశోక్ గజపతి రాజుని టార్గెట్ చేయటం మొదలు పెట్టారు. ముఖ్యంగా గతంలో జగన్ మోహన్ రెడ్డి కేసులు విషయంలో, హైకోర్టుకు అశోక్ గజపతి రాజు ఫిర్యాదు చేసారు అనే కోపం కావచ్చు, ఆయన్ను టార్గెట్ చేసారు. మాన్సాస్ చైర్మెన్ గా అశోక్ గజపతి రాజుని రాత్రికి రాత్రి తొలగించి, ఆయన స్థానంలో, సంచయితను నియమించారు. అయితే దీని పై సుదీర్ఘంగా, ఏడాదికి పైగా జరిగిన న్యాయ పోరాటంలో, హైకోర్టు సంచయిత నియామకాన్ని రద్దు చేసింది. దీంతో మళ్ళీ అశోక్ గజపతి రాజు, మాన్సాస్ చైర్మెన్ గా నియామకం అయ్యారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, కోర్టు ఆదేశాలు కాబట్టి ప్రభుత్వం ఏమి చేయలేక పోయింది.
ఇక తరువాత, ఈవో సహకరించటం లేదని, జీతాలు ఇవ్వటం లేదని, ఇలా అనేక వార్తలు వచ్చాయి. చివరకు ఇది కూడా కోర్టు ముందకు వెళ్ళటం, కోర్టు ఈవో ని చీవాట్లు పెట్టటం జరిగింది. ఇలా నడుస్తూ ఉండగానే, ఇప్పుడు మాన్సాస్ విషయంలో మరో ట్విస్ట్ నెలకొంది. మాన్సాస్ చైర్మెన్ గా తనని నియమించాలి అంటూ, ఆనందగజపతిరాజు కుమార్తె ఊర్మిళా గజపతి, హైకోర్టులో ఈ రోజు పిటీషన్ వేసారు. అశోక్ గజపతి రాజుని తొలగించి, తనను నియమించాలని పిటీషన్ వేసారు. ఈ కేసు రేపు హైకోర్టు ముందు విచారణకు రానుంది. అయితే ఇప్పటి వరకు సంచయిత తనని తీసేయటం పై అపీల్ చేయలేదు. ఈ నేపధ్యంలో ఉన్నట్టు ఉండి ఊర్మిళా గజపతి తెర పైకి రావటంతో అందరూ ఆశ్చర్య పోతున్నారు. సంచయితకు, ఊర్మిళకు పొసగదు. మరి ఊర్మిళ పిటీషన్ వెనుక ఎవరు ఉన్నారు, ఆమె ఉద్దేశాలు ఏమిటి ? ఇన్నాళ్ళు లేనిది , ఇప్పుడే ఆమె ఎందుకు పిటీషన్ వేసారు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ పిటీషన్ పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.