విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తున్నారని, ఇందులో బీజేపీకి, వైసీపీ సంపూర్ణ సహకారం అందిస్తుందని, పార్లమెంట్ లో చెప్పినా, పోస్కోతో డీల్ గురించి బయటకు వచ్చినా, ఉద్యమం జరుగుతున్నా, విశాఖలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం రావటంతో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో, సంపూర్ణ సహకారం ఉంది అనుకున్నారో ఏమో కానీ, కేంద్ర ప్రభుత్వం మరింత దూకుడుగా వెళ్తుంది. ఈ రోజు ఈ సమస్య పై, ఒకే రోజు ఇద్దరు కేంద్ర మంత్రులు తెగేసి చెప్పేసారు. ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం పై, మరోసారి కేంద్రప్రభుత్వం పార్లమెంట్ వేదికగా స్పష్టం చేసింది. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పారు. దేశంలో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తామని స్పష్టం చేసారు. ఇలా ప్రైవేటు పరం చేయటం ద్వారా, కేంద్రానికి రూ.1.75 లక్షల కోట్లు వస్తాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో, ఆ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళటానికి అనేక కారణాలు ఉన్నాయని అన్నారు. ఆ ప్లాంట్ రుణ భారం పెరిగి పోయిందని, తుక్కువ ఉత్పత్తి చేస్తున్నారని, ఇవి ముఖ్య కారణాలు అంటూ ఆమె వివరించారు.
అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇక మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా స్పందించారు. "ప్రభుత్వ రంగ స్టీల్ కంపెనీలకు అవసరమైన ఇనుప ఖనిజం, బొగ్గు సొంత గనుల ద్వారా సమకూరుతుంది. సొంత గనులు లేని సంస్థలు దేశీయ మార్కెట్ లేదా దిగుమతి చేసుకుంటాయి. తమకు సొంత గనులు కేటాయించాలని విశాఖ స్టీల్ ప్లాంట్ సంస్థ, ఒడిశా, ఛత్తీస్ గఢ్, ఏపీని కోరింది. కేంద్ర ఉక్కు శాఖ సైతం ఒడిశా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. 2020 మార్చిలో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు జార్ఖండ్‌లోని రబోడి బొగ్గు గనులు కేటాయిస్తూ జార్ఖండ్ ప్రభుత్వం ఆమోదించింది,. కానీ సొంత ఇనుప ఖనిజం గనులు లేవు అంటూ, ధర్మేంద్ర ప్రధాన్ మరోసారి పార్లమెంట్ వేదికగా స్పష్టం చేసారు. అయితే నిన్న వచ్చిన ఎన్నికల ఫలితాల్లో అధికార వైసిపీ పార్టీని ప్రజలు గెలిపించారు అంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతున్నారని అర్ధం చేసుకుని, కేంద్రం కూడా దూకుడుగా వెళ్తుంది ఏమో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.