విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ.. ఇద్దరు రోగులు చనిపోయిన ఉదంతం కలకలం రేపింది. బుధవారం రాత్రి బలంగా వీచిన గాలులకు ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన కొద్దిసేపటికే వీరిద్దరు మరణించారు. కరెంటు పోయిన వెంటనే జనరేటర్ వేయకపోవడంతో, ఆక్సిజన్ అందక తమవారు చనిపోయారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి వద్ద కొన్ని గంటలపాటు వారంతా బైఠాయించారు. అయితే, బాధితుల వాదనను ఆస్పత్రి వర్గాలు మాత్రం కొట్టివేస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..విజయవాడ ఇందిరానగర్‌కు చెందిన కె.వరప్రసాద్ (22) ప్రమాదంలో గాయపడ్డారు. తలకు బలమైన గాయం తగిలిన ఆయనను శనివారం కొత్త ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ట్రామా కేర్‌లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
అదే విభాగానికి మంగళవారం విజయవాడ రాణిగారితోటకు చెందిన ఎస్.ఆదినారాయణ (50)ను తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదినారాయణ ఓ ప్రమాదంలో గాయపడ్డారు. అతని కుటుంబ సభ్యులు తొలుత ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మంగళవారం ఇక్కడకు తీసుకువచ్చారు. వరప్రసాద్, ఆదినారాయణ బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఒకరి తర్వాత మరొకరు చనిపోయారు. వారు చనిపోవడానికి ముందుగా ఈదురు గాలుల కారణంగా ఆ ఆస్పత్రిలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కాసేపటికి ఆస్పత్రి సిబ్బంది జనరేటర్‌ను ఆన్‌చేసి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. అయితే జనరేటర్ ఆన్ చేయడంలో జాప్యం వల్లే తమవారు ఆక్సిజన్ అందక చనిపోయారనేది బాధితుల ఆరోపణ. అయితే, తమ దగ్గరకు వచ్చేప్పటికే ఆ రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రుల అధికారులు వాదిస్తున్నారు.
విద్యుత్తు సరఫరా నిలిచిపోయినా సుమారు అరగంటపాటు వెంటిలేటర్లకు బ్యాకప్ ఉంటుందని వివరించారు. ఆ అరగంట లోపే జనరేటర్‌ను ఆన్ చేసి విద్యుత్తును పునరుద్ధరించడం జరిగిందన్నారు. వరప్రసాద్, ఆదినారాయణ చికిత్స పొందుతున్న ట్రామా కేర్‌లోనే మరో ఏడుగురు వెంటిలేటర్లపై ఉన్నారని, వారంతా క్షేమంగానే ఉన్నారని తెలిపారు. కాగా, విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుడు (డీఎంఈ) కె.బాబ్జి ఆస్పత్రికి వచ్చి విచారణ చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.బాబూలాల్‌తో మాట్లాడి వివరాలు సేకరించి వెళ్లారు.