ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాల్లో మరో సంచలన వార్త. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో, ఒక్కసారిగా అధికార వర్గాల్లో కలకలం రేగింది. మొన్నటికి మొన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని, బదిలీ చేస్తూ, సంచలన నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేశంలోనే సంచలనానికి తెర లేపింది. మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యన్ని, బదిలీ చేస్తూ, ప్రాధాన్య లేని శాఖకు బదిలీ చేసింది. అయితే తరువాత అయన సెలవు పై వెళ్ళటం, ఢిల్లీ వర్గాలను కలవటం సంచలనంగా మారింది. అయితే, జగన్ ప్రభుత్వం మాత్రం, తాను చెప్పాలి అనుకున్న సందేశాన్ని, అధికార వర్గాలకు గట్టిగా పంపించింది. అప్పటి నుంచి ఐఏఎస్ వర్గాలు, ఎప్పుడు ఏమి జరుగుతుందో, ప్రభుత్వ ఆగ్రహానికి ఎప్పుడు గురి అవుతామో అంటూ, ఆలోచిస్తూ ఉండగానే, ఇప్పుడు మరో ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చెయ్యటం సంచలనం అయ్యింది. విధి నిర్వహణలో అలసత్వం వహించారు అంటూ, ఇద్దరినీ సస్పెండ్ చేసారు.
జీఏడీలో పని చేస్తున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులు సస్పెండ్ అవ్వటంతో, మరోసారి ఐఏఎస్ వర్గాల్లో కలకలం రేగింది. జీఏడిలో అసిస్టెంట్ కార్యదర్శిగా పని చేస్తున్న జయరామ్, అక్కడే సెక్షన్ అధికారిగా పని చేస్తున్న అచ్చెయ్యను సస్పెండ్ చేస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు ఇచ్చారు. కేంద్రం నుంచి వచ్చిన ఒక, ఐఆర్ఎస్ ఆఫీసర్ రిలీవ్ అంశంలో, వచ్చిన ఫైల్ విషయంలో, ఈ ఇద్దరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే, ఫైల్ ను ఉన్నతాధికారులకు చెప్పకుండా దాచి పెట్టారు అనేది అభియోగం. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఏపీ ఎండీసీకి ఎండీగా ఉన్న, వెంకయ్య చౌదరిని జీఏడీకి రిలీవ్ చెయ్యాల్సిందిగా చెప్తూ రిపోర్ట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో ఆయన తిరిగి తన మదర్ డిపార్టుమెంటులో పోస్టింగ్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
అయితే ఈ విషయంలో, ఆయన్ను డీమ్డ్ టు బి రిలీవ్ అని ప్రస్తావించటం, వెంకయ్య చౌదరి పై, విజిలెన్స్ రెమర్క్ లను కూడా, ఫైల్ లో ప్రస్తావించక పోవటంతో, అచ్చెయ్య, జయరామ్ పై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వీరిద్దరూ, కావాలనే ఇలా చేసారు అంటూ, ప్రభుత్వం భావించింది. సిఎంఓ లో ఒక కీలక ఆధికారి, ఇద్దరినీ పిలిచి వివరణ అడిగే ప్రయత్నం చెయ్యటం, వారు కారణాలు చెప్పటం, ఈ విషయాన్ని జగన్ కు నివేదించటంతో, ఆయన వెంటనే తగు చర్యలు తీసుకోమని చెప్పటంతో, ఆ ఇద్దరు అధికారులపైన సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంకయ్య చౌదరిని రాష్ట్ర సర్వీస్ నుంచి రిలీవ్ చేసి, కేంద్రానికి పంపించే సమయంలో, ఆయన పై ఉన్న అభియోగాలు ప్రస్తావించలేదు అనే కారణంతో, ఇద్దరు ఐఏఎస్ అధికారులను సస్పెండ్ చెయ్యటం సంచలనంగా మారింది. అలాగే ఈ ఇద్దరినీ, అనుమతి లేకుండా రాజధాని వదిలి వెళ్లవద్దంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశం సైతం ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది. మరి ఈ ఇద్దరు నుంచి, వివరణ తీసుకునే ప్రభుత్వం సస్పెండ్ చేసిందా, లేక, ఎటువంటి విచారణ లేకుండా సస్పెండ్ చేసిందా అనేది తెలియాల్సి ఉంది.