అంతర్జాతీయంగా పేరొందిన రెండు ప్రతిష్ఠాత్మక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. నిర్మాణ పరికరాలు, గ్లాస్ తయారీలో ప్రఖ్యాతిగాంచిన ఫ్రెంచి దిగ్గజ సంస్థ సెయింట్ గోబైన్ రూ.2000 కోట్లతో విశాఖ జిల్లా అచ్యుతాపురంలో పరిశ్రమ స్థాపనకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిద్వారా 1300 మందికి ఉపాధి కల్పించనుంది. అలాగే ప్రపంచ ప్రఖ్యాత గ్లోబల్ గ్రాబ్ మెషీన్ టూల్స్ సంస్థ రూ.304 కోట్లతో అనంతపురం జిల్లా గుడిపల్లిలో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దీనిద్వారా మరో 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ రెండు సంస్థలూ ఏపీలో తమ కార్యకలాపాలను చేపట్టడం ద్వారా దక్షిణాదిలో వర్తకాన్ని విస్తరించేందుకు సిద్ధమయ్యాయి. ఒకట్రెండు రోజుల్లో పరిశ్రమల శాఖ వాటికి భూ కేటాయింపులతో పాటు ప్రోత్సాహకాలను ప్రకటించనుంది.
మరో పక్క, రాష్ట్రంలో పారిశ్రామిక విధానాలు అద్భుతంగా ఉన్నాయని.. సరళీకృత విధానాల వల్ల త్వరితగతిన పరిశ్రమలకు అనుమతులు మంజూరవుతున్నాయని రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించిన పారిశ్రామికవేత్తలు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందానికి ఇటీవల వెల్లడించారు. రాష్ట్రంలో అమలులో ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంపై సర్వే నిర్వహించిన ప్రపంచ బ్యాంకు బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి 424 అంశాలపై పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో రాష్ట్రంలో అమలులోని పారిశ్రామిక విధానాలకుగాను 329 మార్కులు వస్తే.. పెట్టుబడిదారులు వెల్లడించిన అభిప్రాయాల మేరకు 33.7 మార్కులొచ్చాయి.
ముఖ్యంగా కార్మిక చట్టాల అమలులో సరళీకృత విధానాలు బాగా అమలవుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తూ నూరు శాతం మార్కులు ఇచ్చారు. వాస్తవానికి .. ఈ అంశంలోనే కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాన్ని పక్కకు తప్పించి.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో వెనక్కు నెట్టే ప్రయత్నం చేసింది. రాష్ట్రంలో కార్మిక చట్టాలు కఠినంగా ఉన్నాయంటూ కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో కార్మిక చట్టాలు సరళీకృతంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నా కేంద్రం పట్టించుకోలేదు. కేవలం.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న సంస్థలకు మినహా.. మిగిలిన పరిశ్రమలకు సరళీకృత కార్మిక చట్టాలు అమలు కావడంలేదంటూ కేంద్రం దబాయించే ప్రయత్నం చేసింది.