తలసేమియా బాధితులకు పూర్తి ఉచిత వైద్యం అందిస్తూ, వారికి నెలకు రూ.2 వేల పింఛన్ సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన తలసేమియా హిమోఫీలియా చికిత్స కేంద్ర భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తలసేమియా, హిమోఫీలియా బారిన పడిన చిన్నారులకు మూడు వారాలకు ఒకసారి రక్త మార్పిడి చేయాల్సి ఉంటుందన్నారు. ఈకారణంగా వారి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు పడటంతో పాటు మనోవ్యధకు గురవుతున్నారన్నారు. ఆ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు అండగా ఉండాలని నిర్ణయించానని, భవిష్యత్తులో వ్యాధి నివారణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామన్నారు.
వైద్య ఖర్చులకోసం పేదలు ఎన్నో వ్యయప్రయాసలకు గురవుతున్నారని, ఇకనుంచి తలసేమియా వ్యాధి సోకిన వారికి వైద్యంతో పాటు నెలకు రూ.2 వేల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఈమేరకు అన్ని జిల్లాల్లో చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనారోగ్యం కారణంగా పేదలు ఆర్థికంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో వారికి ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఎన్‌టీఆర్ ఆరోగ్య రక్ష, మాతా శిశు సంరక్షణ, ఎన్‌టీఆర్ బేబీకిట్స్, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, 108, 104 ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చికిత్సలు అమల్లోకి తెచ్చామన్నారు. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అనంతరం తలసేమియా బాధిత చిన్నారులను ముఖ్యమంత్రి పలకరించారు. తొలుత భవనం ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రికి రెడ్‌క్రాస్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. బాలసుబ్రమణ్యం, భవనం దాత వెలమాటి జనార్దనరావు, రెడ్‌క్రాస్ జిల్లా ఛైర్మన్ మాగంటి ప్రసాద్, డీసీహెచ్‌ఎస్ శంకరరావు ఘన స్వాగతం పలికారు. అనంతరం రెడ్‌క్రాస్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన రెడ్‌క్రాస్ సొసైటీ అంతర్జాతీయ వ్యవస్థాపకులు జీన్ హెన్సీ డ్యూనాంట్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రి పర్యవేక్షకుడు ఏవీఆర్ మోహన్, రెడ్ క్రాస్ కార్యదర్శి తన్నీరు మునియా, సభ్యులు మడుమిల్లి మోహనగుప్తా, అల్లూరి ఇంద్రకుమార్, మంతెన వెంకటరామరాజు తదితరులు పాల్లొన్నారు.