జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి అందరికీ తెలిసిందే. తన మాటే వినాలని, ఆప్షన్ లేదని, ఎవరైనా హక్కులు అంటూ మాట్లాడితే, వారికి ఎలా షాక్ ఇవ్వాలో అలా ఇస్తారు. మాస్కు అడిగిన డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి నిన్న ఉద్యోగ సంఘాలకు జరిగిన పరాభవం దాకా, ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. నిన్న ఉద్యోగ సంఘాల నేతలకు జగన్ మార్క్ షాక్ తగిలింది. ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ నివేదిక ఇస్తాం రమ్మని ఉద్యోగ సంఘాలను పిలిచి అవమానించారు అంటూ, ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోయిన సారి జరిగిన మీటింగ్ లో, వారం రోజుల్లో నివేదిక ఇస్తాం అన్నారని, ఎన్ని రోజులు అయినా నివేదిక బయట పెట్టకపోవటంతో, గట్టిగా అడిగితే, బుధవారం రమ్మన్నారని, అందుకే సచివాలయానికి వచ్చామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చలనం లేదు. చీఫ్ సెక్రటరీ ఇప్పుడే వస్తానని, సియం వద్దకు వెళ్ళారని, ఆయన తమకు పీఆర్సి నివేదిక ఇచ్చే వరకు ఇక్కడ నుంచి వెళ్ళేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయం ఆవరణలోనే కూర్చుని నిరసన తెలిపారు. ఒక గంట అయ్యింది, రెండు గంటలు అయ్యాయి, చివరకు రాత్రి 9 అయ్యింది. అయినా ఎవరూ ఉద్యోగ సంఘాల నేతలను పిలవలేదు.
చీఫ్ సెక్రటరీ అంత సేపు సియం క్యాంప్ ఆఫీస్ లో ఉండే అవకాసం లేదు. ఉన్నతాధికారులకు ఫోనులు చేసారు. అటు వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆరు గంటలు గడిచి పోయాయి. ఇక తమను ఎవరూ పట్టించు కోవటం లేదు అనే విషయం ఉద్యోగ సంఘాల నేతలకు అర్ధం అయ్యింది. చివరకు ఆరు గంటలు వేచి చూసిన ఉద్యోగ సంఘాల నాయకులు, చేసేది ఏమి లేక, అక్కడ ఉన్న సిబ్బంది , పోలీసుల కూడా వెళ్ళిపోవాలని కోరటంతో, రాత్రి 9 తరువాత వెనుదిరిగారు. ఈ రోజు తమ కార్యాచరణ ప్రకటిస్తామని, ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ ప్రభుత్వం రావాలని, కుడి చేత్తో, ఎడమ చేత్తో ఓట్లు వేశామని అన్నారు. తమను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని, ఈ రోజు అన్ని సంఘాలతో కలిసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకతిస్తామాని, అవసరం అయితే విధులు కూడా బహిష్కరిస్తామని అగ్రహ వ్యక్తం చేసారు. మొత్తానికి రెండు చేతులతో ఓట్లు వేసి జగన్ ను గెలిపించాం అని చెప్తున్న ఉద్యోగ సంఘాల నేతలకు, జగన్ మార్క్ షాక్ నిన్న గట్టిగానే తగిలింది.