"కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతూ, చిప్ప కూడు తిని వచ్చినాడు కూడా అవినీతి పై పాఠాలు చెప్తుంటే, మా ఖర్మ, నీ లాంటి వాళ్ళ మాటలు వినాల్సి వస్తుంది" అంటూ తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా, విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల విజయసాయి రెడ్డి, వ్యంగ్యంగా, లేకి ట్వీట్ లు వేస్తూ అందరినీ కవ్విస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, దేవినేని ఉమా పై కూడా విజయసాయి రెడ్డి, లేకి ట్వీట్ లు పెట్టారు. దీనికి ఉమా ఈ రోజు ఘాటుగా స్పందించారు. " ఈ రోజు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో కూర్చుని ట్వీట్లు కొడుతున్నాడు. ఆయన ఒక ఏ2 ముద్దాయి. వారం వారం కోర్ట్ కు పోతాడు.. మా ఖర్మ నాయన. నీ లాంటి వాడితో కూడా నీతులు చెప్పించుకోవాల్సిన ఖర్మ వచ్చింది. నువ్వు బినామీ బ్రీఫ్ కేసు కంపెనీలు పెట్టి, ఏ2గా, 16 నెలలు జైలులో ఉండి, బెయిల్ పై బయట తిరుగుతున్న వాడివి. ఈరోజు నీకు కాలం కలిసి వచ్చి, నీతులు చెప్తున్నావ్"
"ఢిల్లీలో ఓ కేబినెట్ హోదా పదవి వెలగబెడుతున్నావ్. ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతూ, మా లాంటి వాళ్ళను దొంగ అంటున్నావ్. పిచ్చి మాటలు మానేసి,మంచిగా బ్రతుకు విజయసాయి’ అని ఉమా వ్యాఖ్యానించారు. ప్రజావేదికను కూల్చటం ద్వారా జగన్ మోహన్ రెడ్డి పైశాచిక ఆనందాన్ని పొందుటం తప్ప, ఒక్క ఉపయోగం ఉందా అంటూ స్పందించారు. ఇలాంటి ఉడత ఊపులకు తాము భయపడమని, అన్నటికీ సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నామని చెప్పారు. ఊడుత ఊపులకు, పోలీస్ కేసులకు, కర్ర ఊపుడుకు తాము భయపడి వెనకడుగ వెయ్యమని, ప్రజల కోసం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి.. టైం. కాలం చాలా బలీయమైనది. ప్రతీఒక్కరికీ ఒకరోజు వస్తుంది. కాలం చాలా క్రూరమైనది. కాలం శక్తిమంతమైనది. నువ్వు కూర్చున్న కుర్చీ, 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగం అని మర్చిపోయి ఎగరకు అంటూ ఉమా ఘాటు వ్యాఖ్యలు చేసారు.