ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనా విధానానికి ఐక్యరాజ్యసమితిలోని భారతదేశ శాశ్వత ప్రతినిధి, రాయభారి సయ్యద్ అక్బరుద్దీన్ ముగ్ధులయ్యారు. అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రిని ఆదివారం అక్బరుద్దీన్ మర్యాదపూర్వకంగా కలిసి, విందు సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ కోసం తీసుకుంటున్న చర్యలు, రైతులను ప్రోత్సహించే విధానాన్ని ఈ సందర్బంగా అక్బరుద్దీన్‌కు ముఖ్యమంత్రి వివరించారు.
60 లక్షల మంది రైతులు కనీసం రెండు కోట్ల ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనలు, చురుకైన నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శవంతమైన, స్ఫూర్తిదాయకమైన రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తున్నాయని అక్బరుద్దీన్ ప్రశంసించారు. ఇరువురూ కలిసి నూతన వ్యవసాయ విధానాలు, రైతులకు రెట్టింపు ఆదాయాన్ని తీసుకొచ్చే మార్గాల గురించి కాసేపు చర్చించారు. అనంతరం ‘న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్ సెనేట్’లో ప్రవాస తెలుగు సంఘాలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించడంతో పాటు జన్మభూమి రుణం తీర్చుకోవాల్సిన తరుణం ఇదేనని పిలుపునిచ్చారు.
అరకు శాసన సభ్యుడు కిడారి సర్వేశ్వరరావు, మాజీ శాసన సభ్యుడు సివేరి హత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి చెందారు. ఇది పిరికిపందల చర్య అని, హత్యా రాజకీయాలు సరికాదని ఖండించారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ఇంటిటికీ తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్న ప్రజాప్రతినిధిని హతమార్చటం అనాగరిక చర్య అని ముఖ్యమంత్రి ఖండించారు. న్యూయార్కు విమానాశ్రయంలో అడుగుపెట్టగానే ముందుగా ఆయన అరకు ఎమ్మెల్యే హత్య, అనంతరం ఉత్పన్నమైన పరిస్థితిని సమీక్షించారు. ఫోనులో మంత్రులకు, అధికారులకు తగిన సూచనలిచ్చారు.