మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అన్ని ప్రధాన రాజకీయ పక్షాలతో కలిసి ఈనెల 29 న అమరావతిలో ఉండవల్లి ఇన్ కెమెరా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల ప్రతినిధులను ఆహ్వానించారు. ఇందులో ప్రధాన ఎజెండా వచ్చే కొత్త ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది చర్చిస్తారు. ఏపీకి జరుగుతోన్న అన్యాయంపై ఈనెల 29 న విజయవాడలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రకటించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఇందులో కూలంకషంగా చర్చిస్తామని ఆయన తెలిపారు.
ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ఉమ్మడి కార్యాచరణను రూపొందిస్తామని ఉండవల్లి ప్రకటించారు. ఈ సమావేశానికి టీడీపీ, వైసీపీ, జనసేన సహా ఏడు రాజకీయ పార్టీలను ఆహ్వానించామని, అయితే ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వైసీపీ అంగీకరించలేదని అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని కూడా ప్రస్తావించలేని స్థితిలో రాజకీయ పార్టీలున్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న ఉండవల్లి, పవన్ కళ్యాణ్ తరువాత ఆ విషయం గురించి మర్చిపోవటంతో, తానే స్వయంగా రంగంలోకి దిగారు.
ఇప్పటికే పవన కళ్యాణ్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ, లోక్ సత్తా జేపీ కమిటీ, రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై స్పందించాయి. ఇప్పుడు మరోసారి ఉండవల్లి కూడా తన లెక్క ఏంటో చెప్తాను అంటూ వస్తున్నారు. ఉండవల్లి స్కెచ్ ఎంతో తెలియదు కాని, ప్రతి సందర్భంలో జగన్ ను వెనకేసుకుని వచ్చి, చంద్రబాబుని విమర్శించే ఉండవల్లి, ఈ సమావేశం పెట్టటం, ఆ సమావేశానికి వైసీపీ రాకపోవటం ఆశ్చర్యంగా ఉంది. మళ్ళీ ఉండవల్లి, ఏపీకి జరిగిన అన్యాయాన్ని కూడా ప్రస్తావించలేని స్థితిలో వైసీపీ ఉంది అంటూ చెప్పటం, మరో వింత. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో, నిజంగానే చిత్తశుద్ధితో చేస్తున్నారో, ఏదన్నా రాజకీయ కారణం ఉందో తెలియాలంటే, 29 వరకు వేచి చూడాల్సిందే.