వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ భేటీ ముగిసింది. విభజన హామీల అమలు, పార్లమెంటులో పోరాటం పై కొద్ది రోజుల క్రితం ఉండవల్లి, ముఖ్యమంత్రికి లేఖ రాశారు. సీఎం కార్యాలయం ఆహ్వానం మేరకు ఉండవల్లి ఈ రోజు అమరావతికి వచ్చారు. గత కొంతకాలం ఏపీ విభజన హామీల పై అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టారు. అనేక సందర్భాల్లో హోదా విషయంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, ఇప్పటి వరకు జరిగిన కేటాయింపులు, ఖర్చులకి సంబంధించి వాస్తవాలను వెలికితీసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఉండవల్లి కీలకపాత్ర వహించారు.
చంద్రబాబుతో భేటీ అనంతరం ఉండవల్లి మీడియాతో మాట్లడారు ‘‘నేనే ఏ పార్టీలో లేను. ఏ పార్టీలో చేరను. రాజీనామాలకు నేను వ్యతిరేకం. అయినా గతంలో నేను రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాజ్యాంగ విరుద్ధంగా విభజన బిల్లును ఆమోదించారు. నేను గతంలో రాష్ట్రపతి, ప్రధానికి రాసిన లేఖలు, కోర్టుల్లో వేసిన పిటిషన్ల కాపీలను సీఎంకు అందజేశా. అన్ని విషయాలు ఆయనతో చర్చించాను. ఏ విధంగా పోరాటం చేస్తే మంచిదో చెప్పను. నా దగ్గర ఉన్నవి అన్నీ ఆయనకు ఇచ్చాను. ఈ భేటీలో ఎలాంటి రాజకీయం లేదు. రాష్ట్రం కోసం, ఎవరు పోరాడినా, నేను సహకరిస్తాను’’ అని చెప్పారు.
పార్లమెంటు తలుపులు మూసి ఏపీకి అన్యాయం చేశారని ఫిబ్రవరి 7, 2018న ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా చంద్రబాబుకు ఉండవల్లి గుర్తుచేశారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలనే పార్లమెంటులో ప్రస్తావించాలని సీఎంను కోరానని, తన దగ్గర ఉన్న ఆధారాలను సీఎం చంద్రబాబుకు అందజేశానని పేర్కొన్నారు. ఏపీ విభజన బిల్లును ఆమోదించినప్పటి నుంచి రాజ్యాంగ విరుద్ధమని పోరాడుతున్నామని తెలిపారు. దేశ చరిత్రలో లోక్‌సభ నిబంధనలన్నీ ఉల్లంఘించి రాజ్యాంగ వ్యతిరేకంగా విభజన చట్టాన్ని ఆమోదించారని ఉండవల్లి తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పై అవిశ్వాసం తీర్మానం పెట్టాడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దేశంలోని బీజేపీ, కాంగ్రెస్సేతర పార్టీలకు చంద్రబాబు లేఖ రాసి, మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ నేపధ్యంలో ఉండవల్లి కూడా వచ్చి చంద్రబాబుతో చర్చించారు.