ముఖ్యమంత్రి చంద్రబాబుతో, నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ నిన్న సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశం గురించి మరిన్ని విషయాలను తాజాగా ఆయన ప్రస్తావించారు. ఉండవల్లి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి భేటీలో ఎలాంటి రాజకీయాంశాలు తమ మధ్య చర్చకు రాలేదని చెప్పారు. చంద్రబాబుతో భేటీ అయ్యానని జగన్ అభిమానులు ఏమనుకున్నా తనకు ఎలాంటి నష్టం లేదని, పార్టీలను కలిపే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలిచినప్పుడు తనకు ఇష్టం లేకపోయినా వెళ్లానని అన్నారు. రేపటి నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి గొడవా జరగకపోతే విభజన చట్టంలోని అంశాలు ప్రస్తావనకు వస్తాయని అన్నారు.
ఏపీకి కేంద్రం చేసిన అన్యాయం గురించి తెలియజెబుతూ, దేశంలోని పలు పార్టీల నేతలను టీడీపీ ఎంపీలు కలవడం ద్వారా ఏదైనా ప్రయోజనం లభించవచ్చని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ‘‘రాజ్యాంగానికి వ్యతిరేకంగా విభజన జరిగిందంటూ నేను గతంలో లేఖలు రాసిన నేపథ్యంలో.. పార్లమెంటు లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు రా వాలని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. రాష్ట్ర విభజన జరిగిన తీరు, రాష్ట్ర విభజన చట్టం అమలు తీరు పై మా మధ్య చర్చ జరిగింది. ఈ అంశాలపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన విధానాల గురించి చర్చించాం’’ అని మీడియాకు ఉండవల్లి వివరించారు
తాను ఏ పార్టీలోనూ లేనని, కొత్తగా చేరే ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. ‘‘రాజ్యాంగ విరుద్ధంగా విభజన బిల్లును ఆమోదించారు. దీనిపై నేను మొదటి నుంచీ పోరాటం చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఏ అంశంపైనైనా పార్లమెంటులో కోర్టు జోక్యం చేసుకోలేదని.. అయితే పార్లమెంటులో ఆ పనిని ఎంపీలు చేయొచ్చునన్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు కదా అన్న ఒక ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నేను రాజీనామాలకు వ్యతిరేకం. అయితే నేనూ గతంలో రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది’’ అని ఉండవల్లి అన్నారు.