విభజన సమయంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పులు తడకలు, బిల్లులో పెట్టిన అసంపూర్తి అంశాలు ఏవైతే ఉన్నాయో, వాటిని ప్రశ్నిస్తూ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, గతంలోనే సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉంది. చాలా రోజులు అనే కంటే, చాల ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉందనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఒక సవరణ పిటీషన్ ను ఉండవల్లి అరుణ్ కుమార్ ఇందులో దాఖలు చేయటంతో, ఇప్పుడు ఈ అంశం మరోసారి తెర పైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభజన అంశానికి సంబంధించి, తప్పులు జరిగాయని, విభజన జరిగిన ప్రక్రియ సరైంది కాదని, అలాగే భవిష్యత్తులో రాష్ట్రాల విభజన జరిగేప్పుడు, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రానికి సూచనలు ఇవ్వాలని, తప్పులు తడకగా చేయకూడదని, కేంద్రం ఇష్టానుసారం, ఏ రాష్ట్రాన్ని కూడా విభజన చేయకూడదని, దానికి కొన్ని మార్గదర్శకాలు ఇవ్వాలని, తన సవరణ పిటీషన్ లో ఉండవల్లి కోరారు. ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటీషన్ నిన్న, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ ముందుకు వచ్చింది. ఈ అంశాన్ని న్యాయవాది ప్రశాంత్ భూషణ్, జస్టిస్ ఎన్వీ రమణ ముందు ప్రస్తావించారు.
పిటీషన్ దాఖలు చేసి, చాలా కాలం అయ్యిందని, అంతే కాకుండా, ఆంధ్రప్రదేశ్ విభజన పై ప్రాధాన మంత్రి, లోకసభలో, రాజ్యసభలో చేసిన వ్యాఖ్యల పై కూడా ప్రశాంత్ భూషణ్ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ప్రశాంత్ భూషణ్ వాదనలను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అంగీకరించారు. ఈ పిటీషన్ ను త్వరతిగతిన విచారణ చేయటానికి ధర్మాసనం అంగీకరిస్తుందని తెలిపారు. ఉండవల్లి దాఖలు చేసిన పిటీషన్ లో ప్రధానంగా, రాష్ట్రాల విభజన పై తగిన నియమ నిబంధనలు ఉండేలా కేంద్రానికి సూచనలు ఇవ్వాలి అంటూ, వేసిన పిటీషన్ ను వచ్చే వారం, లిస్టు లో పొందుపరచాలి అంటూ, చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీం కోర్ట్ రిజిస్ట్రీని ఆదేశించారు. మొత్తానికి అయితే, ఈ అంశం పైన త్వరలోనే విచారణ జరగబోతుంది. విభజన అంశం పై పూర్తి స్థాయిలో, విచారణ జరిగే అవకాసం ఉంది. ఈ అంశం పై మొదటి నుంచి, ఉండవల్లి అరుణ్ కుమార్, పోరాడుతున్నారు. ఎట్టకేలకు ఈ అంశం, కోర్టు ముందుకు రాబోతుంది. ఏమి జరుగుతుందో చూడాలి.