అమరావతి ప్రాంతంలో ఇప్పటికే వైసీపీకి అన్నీ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జనం మధ్య గెలిచిన ఎమ్మెల్యేలు, ఆ జనాల మధ్యకు రావటానికే భయ పడుతున్నారు. అమరావతి ప్రాంతంలో ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇద్దరి పరిస్థితి అలాగే ఉంది. ఇక జగన్ మోహన్ రెడ్డి కూడా, అమరావతి గ్రామాల మీదుగా సెక్రటేరియట్ కు వెళ్ళాలి అంటే, రోడ్డు మీద ఎవరూ లేకుండా చూసి, ముందుగా డమ్మీ కాన్వాయ్ పంపించి వెళ్ళాల్సిన పరిస్థితి. దీని అంతటికీ కారణం, అమరావతి పై వైసీపీ చూపిస్తున్న వైఖరి. 80 రోజులుగా అమరావతి రైతు కుటుంబాలు, మహిళలు, వృద్ధులు, పిల్లలు, రోడ్డున పడి ఆందోళన చేస్తున్న, ప్రభుత్వం వారి పై కన్ను ఎత్తి కూడా చూడటం లేదు. ఇక స్థానిక ఎమ్మెల్యేలు అయిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా తమకు ఓటు వేసిన ప్రజలు, 80 రోజులుగా రోడ్డున పడి ఆందోళన చేస్తుంటే, ఏమిటి అని అడిగిన పాపాన పోలేదు.
వారి కష్టాలు గురించి తెలుసుకోక పోగా, తిరిగి వారినే విమర్శలు చేస్తున్నారు. అమరావతిలో ఉద్యమం చేస్తున్నది రైతులు కాదని, పైడ్ ఆర్టిస్ట్ లు అంటూ, రైతుల పై విమర్శలు చేస్తున్నారు. వారు అంతా ఒక కులం వాళ్ళే అని విమర్శిస్తున్నారు. రాజకీయ కోణంలో చూస్తున్నారు కాని, వారు ఓట్లు వేస్తేనే మేము గెలిచాం అని గుర్తించటం లేదు. నారా లోకేష్ ని కూడా కాదని, రాజధాని రైతులు గెలిపిస్తే, ఇప్పుడు ప్రజల వైపు కన్ను ఎత్తి కూడా చూడటం లేదు. అమరావతిలో ఇంత గడ్డు పరిస్థితి ఎదుర్కుంటున్న వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. రాజధాని అమరావతిలో ఉన్న తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది కూడా సొంత పార్టీ నుంచే ఈ ఆరోపణలు వస్తున్నాయి.
ఫిరంగిపురం మండలం బేతపూడి సొసైటీ చైర్మన్ పదవికి షేక్ జాకీర్ అనే వైసీపీ నాయకుడు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కూడా జగన్ కు పంపించారు. రాజీనామా చేసిన తరువాత మీడియా సమావేశం పెట్టి, ఉండవల్లి శ్రీదేవి పై సంచలన ఆరోపణలు చేసారు. ఎమ్మెల్యే శ్రీదేవి వల్లే తాము రాజీనామా చేస్తున్నామని స్పష్టం చేసారు. మైనారిటీలు అయిన తమకు, వైసీపీలో ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆయన అన్నారు. ఎమ్మెల్యే తన సొంత సామజికవర్గాన్ని నెత్తిన పెట్టుకుని, తమకు గౌరవం ఇవ్వాటం లేదని అన్నారు. మరో పక్క కొద్ది రోజుల ముందే, తాడికొండ మండల యూత్ అధ్యక్షుడు రాజీనామా చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు, ఇలా వరుస రాజీనామాలతో అధికార పార్టీకి ఎదురుదెబ్బలు తగలుతుండటం గమనార్హం.