మంగళవారం విభజన తర్వాత ఏపీకి జరిగిన అన్యాయంపై విజయవాడలోని ఐలాపురం హోటల్లో మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో అఖిలపక్షం, మేధావుల సమావేశం నిర్వహిస్తారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, నిధులు ఇవ్వకపోవడంపై ఉండవల్లి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరుకావాలని అన్ని పార్టీలకు ఆయన లేఖలు రాశారు. ఉండవల్లి లేఖపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఉండవల్లి సమావేశానికి హాజరుకావాలని టీడీపీ నిర్ణయించింది. సమావేశానికి ఎంపీ సీఎం రమేష్, మంత్రి ఆనందబాబును పంపాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. టీడీపీతో పాటు వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు ఉండవల్లి ఆహ్వానం పంపారు. అయితే టీడీపీతో కలిసి వేదికను పంచుకోలేమని, ఈ భేటీకి తాము రామని వైసీపీ నాయకత్వం తెలిపిందని ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు.
ఇందులో ప్రధాన ఎజెండా వచ్చే కొత్త ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది చర్చిస్తారు. ఏపీకి జరుగుతోన్న అన్యాయంపై ఈనెల 29 న విజయవాడలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రకటించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఇందులో కూలంకషంగా చర్చిస్తామని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ఉమ్మడి కార్యాచరణను రూపొందిస్తామని ఉండవల్లి ప్రకటించారు. ఈ సమావేశానికి టీడీపీ, వైసీపీ, జనసేన సహా ఏడు రాజకీయ పార్టీలను ఆహ్వానించామని, అయితే ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వైసీపీ అంగీకరించలేదని అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని కూడా ప్రస్తావించలేని స్థితిలో రాజకీయ పార్టీలున్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనపై డిమాండ్లు ఊపందుకున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు మోదీ సర్కారు సిద్ధమవుతోన్న తరుణంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు తదితర అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జనవరి 30న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. గతంలో ఇదే అంశంపై రెండుసార్లు నిర్వహించారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న తరుణంలో ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. అన్ని రాజకీయ పక్షాలతో పాటు ప్రత్యేక హోదా, విభజన సమస్యలపై పోరాడే వివిధ సంఘాలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు.