ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉంది. మెడలు వంచేస్తాను అని ప్రజలను నమ్మించి, అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి, రెండేళ్ళు అయినా మెడలు వంచటం కాదు కాదా, కనీసం నోరు కూడా ఎత్తటం లేదు. ఇదే అలుసుగా తీసుకున్న కేంద్రం, ఏపి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిఘటన రాదు అనుకున్నారో ఏమో, ఏకంగా విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. 32 మంది ప్రాణాలు త్యాగం చేస్తే వచ్చిన విశాఖ ఉక్కు పరిశ్రమను, ఇప్పుడు కేంద్రం అమ్మేస్తున్నా, జగన్ రెడ్డి మౌనంగా ఉన్నారు. ఏదో ఒక లేఖ రాసి నా పని అయిపొయింది అన్నట్టు కూర్చున్నారు. అంతే కాకుండా, పోస్కో - జగన్ కు సంబంధించి కూడా, జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. మరో పక్క విజయసాయి రెడ్డి ఆడుతున్న డ్రామాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అందరూ కలిసి ఉద్యమాలు చేస్తున్నా, జగన్ మోహన్ రెడ్డి, కేంద్రాన్ని నిలదీయలేక పోతున్నారు. చేతిలో 28 మంది ఎంపీలు ఉన్నా కేంద్రం పై ఒత్తిడి తేవటం లేదు. రాజ్యసభలో, బీజేపీపై ఒత్తిడి తెచ్చే బలం ఉన్నా, వారికి భేషరతుగా మద్దతు పలుకుతున్నారు. వీటి అన్నిటి నేపధ్యంలో, ఈ రోజు ఉండవల్లి ప్రెస్ మీట్ పెట్టారు. విశాఖ ఉక్కు పై మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి పై అసంతృప్తి వ్యక్తం చేసారు.
జగన్ మోహన్ రెడ్డికి, అతి పెద్ద మెజారిటీతో ప్రజలు గెలిపించారని, ఆ మెజారిటీ ఉంచుకుని కూడా, కేంద్రాన్ని నిలదీయటం లేదని అన్నారు. అసలు జగన్ మోహన్ రెడ్డిని చూసి, ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రజా మద్దతుతో గెలిచిన జగన్, మోడీ అంటే ఎందుకు భయపడుతున్నారని అన్నారు. వాళ్ళు నిన్ను జైల్లో వేస్తారని భయం ఉంటే, దానికి ఎందుకు భయపడటం, నీకు జైలు ఏమైనా కొత్తా అని, మళ్ళీ జైలుకు వెళ్ళు, అక్కడే కూర్చో, అక్కడ నుంచే పరిపాలించు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ఎదిరించి జైలుకు వెళ్ళాడని, ప్రజలు నీ వైపే ఉంటారు. ప్రజల కోసం నేను జైలుకు వెళ్ళాలని గర్వంగా చెప్పుకో. భయపడి పోయి, నోరు మెదపటం లేదని, నీ మీద ఇన్ని ఆరోపణలు వస్తుంటే, నీ వైఖరి కూడా వారి విమర్శలకు బలం ఇచ్చేలా ఉందని అన్నారు. లీడ్ తీసుకుని, ముందుకు వెళ్ళాలని అన్నారు. రాజశేఖర్ రెడ్డి కొడుకు, భయపడి ఇంట్లో కూర్చున్నాడు అనేది కరెక్ట్ కాదు అంటూ ఉండవల్లి, జగన్ పై ఘాటు విమర్శలు చేసారు.