కడప కేంద్రంగా ఓఎన్‌జీసీ మరో యురేనియం ప్లాంటు పెట్టటానికి సిద్ధమవుతుంది. దేశంలోనే రెండో యురేనియం నిల్వల కేంద్రంగా పేరొందిన పులివెందుల నియోజక వర్గంలో ఇప్పటికే ఒక యురేనియం ప్లాంటు వినియోగంలో ఉండగా కనంపల్లె వద్ద రెండో ప్లాంటు దిశగా భారత అణుశక్తి సంస్థ అడుగులు వేస్తోంది.
తుమ్మలపల్లె వద్ద 48.49 మిలియన్ టన్నుల ముడి యురేని యం నిల్వలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. దేశంలో జార్ఖండ్ తర్వాత అంత భారీ నిల్వలు ఉన్న ప్రాంతం ఇదే. రూ. 1103.98 కోట్లు పెట్టుబడితో ఆరంభమైన తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టులో ప్రస్తుతం రోజుకు 2 వేల నుంచి 2500 టన్నుల ముడి యురేనియాన్ని వెలికి తీస్తున్నారు. దాన్ని శుద్ధి చేసే ప్రక్రియలు చేపట్టిన అనంతరం నెలకు 240 టన్నుల ప్రాథమిక శుద్ధి యురే నియంను ఉత్పత్తి చేసి హైదరాబాద్‌కు పంపిస్తున్నారు.
తాజాగా కడప బేసిన్ కేంద్రంగా కడప, అనంతపురం జిల్లాల్లోనే కాక కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి, పాణ్యం, అనంతపురం జిల్లా పరిధి లోని తాడిపత్రి, యల్లనూరు ప్రాంతాల్లో ప్రాథమిక అధ్యయనం పూర్తి అయింది. ప్రస్తుతం కడప పరిధిలో వీరపునాయునిపల్లె , వేంపల్లె, వేముల పరిసరాల్లో అన్వేషణ కొనసాగుతోంది. కడప బేసిన్‌లో నిల్వలు ఉన్నట్లు నిర్ధారణ అయితే సీమకు మహర్థశ పట్టినట్లే.