ఒక పక్క ప్రధాని మోడీ, అమిత్ షా కలిసి, దేశంలో వ్యవస్థలు అన్నీ నాశనం చేస్తున్నారని, అందుకే అందరినీ ఒక తాటి పైకి తెస్తూ చంద్రబాబు ఢిల్లీలో దేశంలో అన్ని రాజకీయ పార్టీలతో మీటింగ్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తారని గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో రాజీనామ చేస్తున్నట్లు ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. భారతదేశ రిజర్వు బ్యాంకులో వివిధ పదవుల్లో సేవలందించడం గర్వకారణంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలినట్లేనని విశ్లేషకులు చెప్తున్నారు.
2016 నుంచి ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఉర్జిత్ హయాంలోనే 2016 నవంబర్ 8న ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం నోట్ల నద్దుపై ఉర్జిత్ పటేల్ అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (జేపీసీ) ఎదుట హాజరై పలుమార్లు వివరణ కూడా ఇచ్చుకున్న విషయం తెలిసిందే. గత కొద్ది కాలంగా ఆర్బీఐకి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న సైలెంట్‌వార్ కారణంగానే గత నెల 19న రిజర్వు బ్యాంకు బోర్డు సమావేశం తర్వాత ఆయన రాజీనామా చేస్తారంటూ వార్తలు వెల్లువెత్తాయి. అయితే, కేంద్రం ఉర్జిత్, బోర్డులో డైరెక్టర్లతో చర్చలు జరిపిన తర్వాత ఆయన తన ఆలోచనను విరమించుకున్నారని అప్పట్లో ఆర్బీఐ వర్గాలు, కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ రోజు అకస్మాత్తుగా ఆయన తన రాజీనామా లేఖను కేంద్రానికి పంపడంతో పాటు వ్యక్తిగత కారణాల రీత్యా వైదొలుగుతున్నట్టు పేర్కొన్నారు.
ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర విషయాల్లో ప్రభుత్వ సూచనలకు రిజర్వ్ బ్యాంక్ ససేమీరా అంటుండటంతో.. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం ఉర్జిత్ పటేల్‌కు ప్రభుత్వం లేఖలు పంపింది. ప్రజా ప్రయోజనం కోసం, నిర్దిష్ట సమస్యల విషయంలో రిజర్వ్ బ్యాంకుతో సంప్రదింపులు జరుపుతూ ఆర్బీఐ గవర్నర్‌కు సూచనలు చేసే అధికారం కేంద్రానికి ఉందని సెక్షన్ 7 స్పష్టం చేస్తోంది. స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటి వరకూ సెక్షన్ 7ను కేంద్రం వాడలేదు. 2008 సంక్షోభం సమయంలోనూ, 1991లో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తినప్పుడు కూడా కేంద్రం ఇలా చేయలేదు. అసాధారణ రీతిలో కేంద్రం సెక్షన్ 7ను ఉపయోగించడంతో.. ప్రభుత్వ ఉద్దేశాలు, ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్లు రాజీనామా చేస్తారని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. రిజర్వుబ్యాంకును ఈ ప్రభుత్వం స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వకుండా, తన అవసరాలను, విధానాలను దాని మీద రుద్దుతూ పీకనులుముతున్నదని బ్యాంకు ఉద్యోగుల సంఘం విరాళ్ ఆచార్య విరుచుకుపడ్డారు. రిజర్వుబ్యాంకు బోర్డులో పరివార్ మనిషి గురుమూర్తిని పార్ట్‌టైమ్ డైరక్టర్‌గా నియమించడంతో నిప్పురాజుకుంది. మోదీ మనిషిగా గురుమూర్తి అతిజోక్యం బ్యాంకులో అందరినీ బాధిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగా రెండోసారి గవర్నర్ గిరీ వెలగబెట్టకూడదని ఉర్జీత్ సైతం అనుకుంటున్నట్టు చెబుతున్నారు.