సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం పై ఆంధ్రప్రదేశ్ ఘనతను అంతర్జాతీయ కంపెనీలు గుర్తించాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో పనిచేస్తూ అంతర్జాతీయ ఖ్యాతిపొందిన సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థలు ఆంధ్రప్రదేశ్ లోని సోలార్ పార్కుల పై ఆసక్తి చూపుతున్నాయి. సంప్రదాయేతర విద్యుదుత్పత్తిలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ (ఎన్ఆర్డీసీ) కర్నూలులోని 1000 మెగావాట్ల సోలార్ పార్కుపై అధ్యయనానికి సిద్ధమైంది.
ఎన్ఆర్డీసీ డైరెక్టర్ జైస్వాల్ తన బృందంతో శుక్రవారం ఇంధన మంత్రి కళా వెంకట్రావును కలిశారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని సోలార్ హబ్‌గా మార్చే ఉద్దేశ్యతో ఉన్నారని మంత్రి కళా వెంకట్రావు ఎన్ఆర్డీసీ బృందానికి తెలిపారు. దీంతోపాటు విద్యుత్ పంపిణీ నష్టాలను ఐదు శాతం దిగువకు తగ్గించడమే లక్ష్యంగా మైక్రో గ్రిడ్ వ్యవస్థ నిర్మాణంపైనా సిఎం దృష్టి పెట్టారని వివరించారు. ఆ ప్రయోజనాలతో రైతులకు పగలే 7 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నారన్నారు.
ఆంధ్రను దేశంలోనే సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో అగ్రగామిగా మార్చుతున్నట్లు మంత్రి ఆయనకు వివరించారు. మొత్తం 4 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుండడమే ఇందుకు తార్కాణమన్నారు. వీటిలో ఇప్పటికే కర్నూలులోని 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ పూర్తయిందన్నారు. దీన్ని రికార్డు స్థాయిలో కేవలం 24 నెలల్లోనే నిర్మించామన్నారు. మిగిలిన సోలార్ పార్కుల్లో అనంతపురం జిల్లాలోని 1500 మెగావాట్ల అనంతపురం-2 అల్ట్రా మెగా సోలార్ ప్లాంటును కూడా త్వరలో పూర్తిచేస్తామన్నారు.
దీనిపై స్పందించిన జైస్వాల్ సమర్థ ఇంధన వినియోగం, ఇంధన పరిరక్షణ, సౌర, పవన విద్యుత్‌ను ప్రోత్సహించడంలో సిఎం చంద్రబాబు అమలు చేస్తున్న విధానాలు ప్రశంసనీయంగా ఉన్నాయన్నారు. కర్నూలు జిల్లాలో ఒకేచోట వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్దదని, దీని తరువాతి స్థానంలో చైనాలోని లోంగ్యాగ్జియాలో మాత్రమే 850 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఉందని జైస్వాల్ అన్నారు.