అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందే గన్నవరం శాసనసభ్యులు డా.వల్లభనేని వంశీ విజయం సాధించారు. ప్రస్తుత విజయ డెయిరీ ఛైర్మన్ మండవ జానకిరామయ్య అనారోగ్య కారణంగా రాజీనామా చేయగా ఆ పదవికి ఎన్నిక అనివార్యం అయ్యింది. ఆ పదవికి ఎమ్మెల్యే వంశీ చలసాని ఆంజనేయులు ను ప్రతిపాదించగా అదే ఛైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న దాసరి బాలవర్ధనరావు ఎలాగైనా ఎన్నికను ఆపాలని ప్రయత్నించారు. వేగంగా స్పందించిన ఎమ్మెల్యే వంశీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు వద్ద తనకు ఉన్న ప్రాధాన్యతను ఉపయోగించి రాజకీయ చాణిక్యతతో ఎన్నిక జరిగేలా చలసాని ఆంజనేయులుకు ఛైర్మన్‌గా ఎన్నికయ్యేలా పరిస్థితులు కల్పించారు.
తెలుగుదేశం పార్టీలో అనేక పదవులను అనుభవించి ఈ సార్వత్రిక ఎన్నికలలో వై.సీ.పీ లో చేరిన దాసరి బ్రదర్స్ ను తీవ్రంగా దెబ్బతీస్తూ చలసాని ఆంజనేయులును విజయ డెయిరీ ఛైర్నన్ స్థానంలో కూర్చోబెట్టడంలో వంశీ విజయం సాధించారు. ఇది ఇలా ఉంటే, కృష్ణా మిల్క్ యూనియన్ వివాదంపై సీఈఓ ద్వివేదికి వైసీపీ ఫిర్యాదు చేసింది. మిల్క్ యూనియన్ చైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులుని నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ద్వివేదికి వైసీపీ నేత దాసరి బాలవర్ధనరావు ఫిర్యాదు చేశారు. మిల్క్ యూనియన్ చైర్మన్ ని రాత్రికి రాత్రే మంత్రి దేవినేని ఉమ మార్చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా రాజకీయ నియామకాలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.