ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక టెన్షన్ పట్టుకుంది. అందులోను గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల సంగతి అయితే సరే సరి. అందరి చూపు వీళ్ళ మీదే. ప్రతి మూమెంట్ ట్రాక్ అవుతూ ఉంది. వీళ్ళు ఏదైనా పని మీద ఢిల్లీ వెళ్లారు అంటే, ఇక్కడ మనకి బ్రేకింగ్ న్యూస్ లు. అదిగో అమిత్ షా ని కలవటానికి వెళ్లారు, అదిగో బీజేపీ కండువా కప్పుకుంటున్నారు అని. ఇక పొరపాటున వాళ్ళు ఎవరైనా బీజేపీ నాయకులను కలిసారు అంటే, న్యూస్ ఛానెల్స్ దాక కూడా అవసరం లేదు, సొంత పార్టీ కార్యకర్తలే, మా వాడు వెళ్ళిపోతున్నాడు అని ప్రచారం చేసేసే పరిస్థితి. ఇది ఎవరి తప్పు కాదు, పరిస్థితిలు అలా ఉన్నాయి. అందుకే తెలుగుదేశం నేతలు ఎవరైనా ఢిల్లీ వెళ్తుంటే, ముందుగా చంద్రబాబుకి చెప్పి, మీడియాకు కూడా పలానా పని మీద వెళ్తున్నా అని చెప్పి వెళ్తున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి, వంశీనీ పార్టీ మార్చేసే పనిలో ఉంది, మీడియా, సోషల్ మీడియా.
వంశీ ఎంత క్లారిటీ ఇచ్చినా, మళ్ళీ మళ్ళీ అవే ఆరోపణలు. తాజగా వంశీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో, ఏపి బీజేపీ నాయకులతో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. మొన్న శనివారం, గన్నవరం నియోజకవర్గంలో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్ట్ కు, కిషన్ రెడ్డి ఇతర బీజేపీ నాయుకులు వచ్చారు. అదే సమయంలో అక్కడ వంశీ ఉండటంతో, ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. స్వర్ణ భారత్ ట్రస్ట్, ఉప రాష్ట్రపతి వెంకయ్యకు చెందినది. అయితే ఈ ఫోటోలు వైరల్ అవ్వటం, ఇంకేముంది మీడియా నుంచి సోషల్ మీడియా దాకా, వంశీ పార్టీ మారిపోతున్నారు, అందుకే కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు అంటూ హడావిడి చేసారు. దీంతో ఈ విషయం పై వంశీ క్లారిటీ ఇచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మికమైన స్వర్ణ భారత్ ట్రస్ట్ , తన నియోజకవర్గంలో ఉందని, వెంకయ్య నాయుడు గారు అంటే ఎంతో గౌరవం అని, ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో పాల్గున్నామే కాని, దీనికి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదని అన్నారు. ప్రతి నెల అక్కడికి వెళ్తూనే ఉంటానని, మరి ఈ సారి ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు అని ప్రశ్నించారు. తాను ఎప్పటికీ , ఎప్పటికీ, చంద్రబాబుకు బద్ధుడై ఉంటానని, ఇందులో వేరే ఆలోచనే లేదని స్పష్టం చేసారు. జై చంద్రబాబు అంటూ ముగించారు.