విజయవాడ వైసీపీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. పార్టీలో కాపు నేతలకు అన్యాయం జరుగుతోందంటూ ఉయ్యూరు కౌన్సిలర్, జిల్లా పార్టీ ఫ్లోర్ లీడర్ వంగవీటి శ్రీనివాస ప్రసాద్ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. వైకాపా నేత వంగవీటి రాధాకృష్ణకు సోదరుడైన శ్రీనివాస ప్రసాద్ రాజీనామా వ్యవహారం పార్టీలో చర్చనీయాంశమైంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటును వంగవీటి రాధాకు కేటాయించకుండా.. మల్లాది విష్ణుకు కేటాయించారంటూ ప్రచారం జరగడంతో విభేధాలు భగ్గుమన్నాయి. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై రాధా అనుచరులు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రజలే జగన్‌కు తగిన బుద్ధి చెబుతారని విమర్శలు గుప్పిస్తున్నారు. సారా కాంట్రాక్టర్లు, అవినీతి పరులకు వైసీపీలో సీట్లు కేటాయిస్తారా..? అని రంగా, రాధా మిత్రమండలి ఆగ్రహంతో ఊగిపోతోంది. ఇదిలా ఉంటే.. వంగవీటి రంగా విగ్రహం దగ్గర రాధా అనుచరులు నిరసనకు దిగారు. రంగా ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గరున్న వైసీపీ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో రంగా ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తామంతా పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని రాధా అనుచరులు అంటున్నారు. మరో పక్క కొంత మంది ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యబోతే, అక్కడ ఉన్న వారి వారించారు.
రాధాకు సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కొందరు కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. అయితే వారిని గమనించిన రాధా అడ్డుకుని వారించారు. పెట్రోల్ చింది ఇద్దరి కళ్లల్లో పడడంతో ఆస్పత్రికి తరలించారు. సీటు మారినట్టు తనకు సమాచారం లేదని రాధా చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై వంగవీటి కుటుంబ సభ్యులు, అనుచరులతో రాధాకృష్ణ నిన్న రాత్రి పొద్దుపోయేవరకు మంతనాలు జరిపారు. రాధాకృష్ణ సోదరుడు ఇవాళ వైకాపాకు రాజీనామా చేయడం చర్చకు దారితీసింది. అసంతృప్తితో ఉన్న వైకాపా నేత వంగవీటి రాధాకృష్ణ సహా ఆయన అనుచరులను బుజ్జగించేందుకు పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు.