విజయవాడ సెంట్రల్ స్థానికి సంబంధించి వైకాపాలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సీటును ఆశిస్తున్న వంగవీటి రాధాతో మాజీ మంత్రి, వైసీపీ నేత పార్థసారథి ఇవాళ భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య సుమారు గంట పాటు ఏకాంతంగా చర్చలు జరిగాయి. సెంట్రల్ సీటును మల్లాది విష్ణుకు ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నారు, ఆ మార్పు కారణాలను రాధాకు పార్థసారథి వివరించారు. విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసే అంశంపై రాధాకు ఆయన వివరించారు. అధిష్టానం ఆలోచనలను ఆయన రాధా ముందు ఉంచినా ఫలితం కన్పించలేదని తెలుస్తోంది.
సెంట్రల్ సీటు విషయంలో రెండో ఆలోచన లేదని రాధా తేల్చి చెప్పినట్లు సమాచారం. తొందరపాటు నిర్ణయాలు వద్దని రాధాకి పార్థసారథి నచ్చ చెప్పినట్లు తెలుస్తోంది. సెంట్రల్ సీటు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదని, రెండో ఆలోచన లేదని రాధా, పార్థసారథికి తేల్చి చెప్పారు. మొన్నటి దాక సీట్ నాదే అని నమ్మించి, ఇప్పుడు హ్యాండ్ ఇస్తే, క్యాడర్ కు ఏమని సమాధానం చెప్పను అంటూ, రాధా పార్ధసారధిని కడిగేస్తినట్టు సమాచారం. దీంతో చేసేది ఏమి లేక, పార్ధసారధి వెనుతిరిగి వచ్చేసారు. వంగవీటి రాధాతో జరిగిన చర్చల సారాంశాన్ని ఆయన పార్టీ అధినేత వైయస్ జగన్‌కు తెలపనున్నారు.
తనకు విజయవాడ సెంట్రల్ సీటు కేటాయించకపోవడంపై వంగవీటి రాధా తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఆయన రంగా రాధా మిత్రమండలి, తన మద్దతుదారులతో వరుసగా భేటీ అవుతున్నారు. మూడు రోజుల పాటు వేచి చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని రెండు రోజుల క్రితం అనుచరులకు సూచించారు. ఈ నేపథ్యంలో పార్థసారథి మధ్యవర్థిగా వచ్చారు.సెంట్రల్ సీటును ఇప్పటికే మల్లాది విష్ణుకు కేటాయిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఆయనను ఇంచార్జిగా నియమించారు. మరోవైపు సీటు విషయంలో వంగవీటి రాధా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో రాధా పార్టీ మారే అవకాశాలు లేదా స్వతంత్రంగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయన చూపు జనసేన వైపు ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.