సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడటంతో జిల్లాలో కొన్ని గ్రామాల్లో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పచ్చనిపల్లెల్లో ఎప్పుడు ప్రతీకారేచ్ఛలు భగ్గుమంటాయోనని పల్లె జనం ఆందోళన చెందుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన నుంచి పల్నాడుతో పాటు డెల్టాలోని పలు చోట్ల వైకాపా వర్గీయులు, తెదేపా వర్గీయులు పై దాడులకు దిగారు. పల్నాడు ప్రాంతంలో రెండు రోజుల నుంచి అనేక పల్లెల్లో రాజకీయ వర్గ వైషమ్యాలు భగ్గుమన్నా పోలీసు పికెట్లు ఇంకా పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేదు. నామమాత్రంగా ఇద్దరు, ముగ్గురు కానిస్టేబుళ్లను గ్రామాలకు పంపుతున్నారు. వీరు ఎండలకు తాళలేక ఏ చెట్టు కిందో, పంచాయతీ కార్యాలయాల వద్దో వేచి ఉంటున్నారు. ఇదే అదనుగా గ్రామాల్లో పోలీసుల నిఘాలేదని ఇరువర్గాలు ఒకరికొకరు రెచ్చగొట్టుకుని దాడులు చేసుకుంటున్నారు.

శుక్రవారం నరసరావుపేట పట్టణంలో పలు కార్యాలయాలకు కోడెల శివప్రసాదరావు నామపలకాలను వైకాపా కార్యకర్తలు తొలగించారు. ఆ ఘటన మరవకుండానే శనివారం దాచేపల్లి మండలం శ్రీనివాసాపురంలో ఒకే సామాజికవర్గానికి చెందినవారు వైకాపా-తెదేపా వర్గీయులుగా విడిపోయి నడిరోడ్డుపై కత్తులు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకునేసరికి అప్పటికే గొడవలు తీవ్రమై రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలకు తలలు పగిలాయి. పిరంగిపురం మండలం 113 తాళ్లూరులో వైకాపా-తెదేపా వర్గీయులు ఎదురుపడి కొట్టుకున్నారు. దీంతో ఇక్కడ కూడా కొందరు గాయాలపాలయ్యారు. మొన్న చంద్రబాబు నివాసం వద్ద.. ఓట్ల లెక్కింపు వేళ వైకాపా స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగానే తాడికొండ నియోజకవర్గానికి చెందిన కొందరు కార్యకర్తలు కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం వద్దకు చేరుకుని వైకాపా జెండాలతో హడావుడి చేశారు.

వారిని అడ్డుకునేందుకు తెదేపా కార్యకర్తలు ప్రయత్నించారు. ఆరోజున ఇక్కడ కూడా ఇరుపార్టీల కార్యకర్తల మధ్య వాదోపవాదనలు జరిగాయి. చివరకు పోలీసులు వచ్చి సర్దిచెప్పి పంపించారు. ఫలితాల రోజున ఒక్క చంద్రబాబు నివాసం వద్దే కాదు.. పిడుగురాళ్లలో ఓ భోజన హోటల్‌పై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. ఇది తెదేపాకు చెందిన నాయకుడిది. దీంతో స్థానిక వైకాపా నేతలు రెచ్చిపోయి ఆ రెస్టారెంట్‌పై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. నరసరావుపేట మండలం దొండపాడులో కొందరు తెదేపా కార్యకర్తలను ఉద్దేశించి ‘ఈనెల 30న ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణస్వీకారం ఉంది. ఆ రోజున మిమ్మల్ని కొడతామని’ ముందుగానే వైకాపా శ్రేణులు హెచ్చరికలు చేసినట్లు చెబుతున్నారు. గత రెండురోజుల నుంచి మాచవరం మండలం పిన్నెల్లి, మోర్జంపాడు గ్రామాలు అట్టుడికిపోతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read