సోమవారం సచివాలయంలో పోలవరం, ప్రాధాన్య జలవనరుల పథకాల నిర్మాణంపై 77వ సమీక్షా సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు. ఇప్పటికి పోలవరం జాతీయ పథకం పనులు 59.01% అయిపోయాయని స్పష్టం చేశారు. గతంలో పునాదిరాళ్లకు, శంకుస్థాపనలకే పరిమితమయ్యే అభివృద్ధి పథకాల రూపురేఖలను తమ ప్రభుత్వం పూర్తిగా మార్చివేసిందని, ఒక దార్శనికతతో తాము చేపట్టిన 57 జలవనరుల పథకాల వరుస ప్రారంభోత్సవాలే ఇందుకు నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణానది మీద పెదపాలెం, డాక్టర్ కె.ఎల్.రావు సాగర్ పులిచింతల, గండికోట రిజర్వాయర్ పథకాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
అలాగే ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ పథకం ఎంతో ప్రతిష్ఠాత్మకమైనదని, ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం తర్వాత జిల్లా రూపురేఖలే మారిపోతాయని, త్వరగా నిర్ణీతకాల వ్యవధిలో త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ సమస్యలు లేని ప్రాజెక్టులను ముందుగా గడువు లోగా పూర్తిచేస్తే.. ప్రారంభోత్సవాలకు సరైన తేదీలు నిర్ణయిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాధాన్య క్రమంలో నిర్మించి ఇప్పటికే పురుషోత్తపట్నం లిఫ్టు, శారదానది మీద ఆనకట్ట, పోగొండ రిజర్వాయరు, నందమూరు ఆక్విడక్టు దాకా అనంతపల్లి వారథి మీదుగా ఉన్నఎర్ర కాల్వ ఆధునికీకరణ, కండలేరు లెఫ్ట్ కెనాల్ లిఫ్టు పథకం, గండికోట-సిబిఆర్ లిఫ్ట్స్, ప్రతిష్ఠాత్మక ముచ్చుమర్రి లిఫ్టు స్కీమ్, సిద్ధాపురం లిఫ్టు పథకం, ఎస్.హెచ్.-31 రోడ్వర్క్, పాలకుర్తి గురురాఘవేంద్ర లిఫ్టు, చినసాన లిఫ్టు, కొండవీటి వాగు ఎత్తిపోతల, గోరుకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అవుకు సొరంగం, పులికనుమ లిఫ్టు పథకాలను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక ప్రారంభోత్సవాలకు ముహూర్తాలు నిర్ణయించుకోవాల్సి ఉందన్నారు.
నిర్మాణంలో ఉన్న 27 ప్రాజెక్టులను వచ్చే ఏడాది జూన్‌లోగా దశలవారీగా వేగవంతంగా పూర్తిచేస్తామన్నారు. ఈనెల 15న గండికోట, నెల్లూరు బ్యారేజీ, నవంబర్ 30న సంగం బ్యారేజీ, డిసెంబర్ నెలాఖరుకు వంశధార-నాగావళి, వంశధార ఫేజ్-2, స్టేజ్-2, ఈ ఏడాది డిసెంబర్ కల్లా మల్లెమడుగు, బాలాజీ, వేణుగోపాల సాగర్ రిజర్వాయర్, సోమశిల-స్వర్ణముఖి, ఎర్రం చిన్నపోలి రెడ్డి కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్, మహేంద్రతనయ రిజర్వాయర్ ఆఫ్ షోర్ పథకాలు ప్రారంభించాలని జలవనరుల శాఖ ఒక కాల నిర్ణయ పట్టికను తయారు చేసింది. వచ్చే జనవరి 15 నాటికి వెలిగొండ సొరంగం-1, మే నెలాఖరుకు సొరంగం-2 పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచనలతో జలవనరుల శాఖ ఒక నిర్ణీత సమయాన్ని నిర్దేశించుకుంది. అలాగే ఫిబ్రవరికి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మార్చి నాటికి హెచ్.ఎన్.ఎస్.ఎస్ మెయిన్ కెనాల్ ఫేజ్-1, మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్ ఆధునీకరణ, కమ్యూనిటీ లిఫ్ట్& డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, కడపజిల్లా కోడూరుకు గాలేరు-నగరి సుజల స్రవంతి-2 నీరు (7 ప్యాకేజీలు), వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్టు, వచ్చే ఏడాది జూన్ నాటికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఫేజ్-1 పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలతో జలవనరుల శాఖ శరవేగంగా కదులుతోంది. అలాగే వచ్చే జూన్ కు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి అప్పర్ పెన్నార్ కు లిఫ్టు ద్వారా నీరు ఇవ్వాలి, తారకరామ తీర్ధ సాగరం రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తిచేయాలని నిశ్చయించింది.