‘మీరంతా సైకిల్ గుర్తుకు ఓటేయండి.. మీరంతా చంద్రబాబును గెలిపించాలి..’ అని ఆయన అనగానే.. అంతా అవాక్కయ్యారు. ఇదేంటా.. ఆయన ఇలా అంటున్నారేంటా..? అని కార్యకర్తలంతా ఖంగుతిన్నారు.. దీంట్లో తప్పేముందని అనుకుంటున్నారా..? ఇదే వ్యాఖ్యలను టీడీపీ అభ్యర్థి చెబితే తప్పు లేదు కానీ.. ఓ వైసీసీ అభ్యర్థి చెబితే.. కొంపకొల్లేరయినట్లే.. ఆదివారం ప్రచారపర్వంలో ఇదే జరిగింది. పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో మైలవరం నియోజక వర్గం నుంచి రాష్ట్ర మంత్రి ఉమాకు పోటీగా నిలిచిన వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రచారాన్ని ఉధృతం చేశారు.
ఈ క్రమంలోనే సోమవారం జి.కొండూరు మండలం కవులూరులో నవరత్నాలు, గడపగడపకు వైసీపీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ‘సైకిల్ గుర్తుకు, చంద్రబాబుకు ఓటు వేయండి’ అంటూ ప్రజలను అభ్యర్థించడంతో అక్కడ పార్టీ నాయకులంతా అవాక్కయ్యారు. అక్కడున్న వైసీపీ నేతలు నిర్ఘాంత పోయారు. చాటుగా గమనించిన టీడీపీ మద్దతుదారులు చప్పట్లు కొట్టారు. దీంతో నాలుక కర్చుకొని కేపీ తప్పయింది. వైసీపీకి, ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి అని మాట మార్చారు. ఈపరిణామం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇది ఇలా ఉంటే, రెండు రోజుల క్రిందట నగిరిలో రోజాని, అక్కడ ప్రజలు నిలదీసిన సంగతి తెలిసిందే.
ఇక మరో పక్క, ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వైకాపా ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి అనటంతో వేదికపై ఉన్న వారందరూ ఖంగుతిన్నారు. విశాఖ మద్దిలపాలెం నగర పార్టీ కార్యాలయంలో ఎన్నికల సందర్భంగా ఆయన సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైకిల్ గుర్తుకు ఓటెయాలని పేర్కొన్నారు. వేదిక మీద ఉన్న వారు అప్రమత్తం చేయటంతో ఆయన వెంటనే సర్దుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటువేయాలని సరిదిద్దుకున్నారు.