ఏపీ సచివాలయాలనికి వాస్తు దోషాలు వెంటాడుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిలో తాత్కాలిక సచివాలయాన్ని అప్పటి సీఎం చంద్రబాబు నిర్మించారు. అయితే టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా సచివాలయంలో అనేక మార్పులు-చేర్పులు చేశారు. ఏపీ సచివాలయంలో వాస్తు దోషాలపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ సచివాలయం మొదటి బ్లాక్‌లో వాస్తు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాస్తు పండితుల సూచనలతో స్వల్ప మార్పులు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆగ్నేయం నుంచి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఛాంబర్‌లో మార్పులు-చేర్పులు చేస్తున్నారు. పాత ఛాంబర్ పక్కన కొత్త ఛాంబర్ అధికారులు నిర్మిస్తున్నారు. సీఎం ఛాంబర్‌లోకి వెళ్లే ఒక ద్వారం మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
సచివాలయం మొదటి బ్లాకులోని సీఎస్ కార్యాలయంలో మార్పులు-చేర్పులు చేస్తున్నారు. ప్రొటోకాల్ రూం, సందర్శకులు వేచి ఉండే గదుల గోడలు తొలగించారు. మొదటి బ్లాకులో ఉన్న చంద్రబాబు ఫొటోలను తొలగించిన విషయం తెలిసిందే. ఈ నెల 31 నుంచే సచివాలయంలో కొత్త సీఎంగా జగన్ అడుగుపెడుతారని ప్రచారం జరిగింది. జగన్ రాక సందర్భంగా సచివాలయంలో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం ఛాంబర్, కేబినెట్ హాల్, హెలిపాడ్, సీఎం కాన్వాయ్ రూట్‌లను ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. జగన్ నేమ్ ప్లేట్‌ను కూడా సుబ్బారెడ్డి పరిశీలించి ఆమోదించారు. అయితే సచివాలయంలో బాధ్యతలు స్వీకరించాలనుకున్న జగన్ చివరి నిముషంలో వాయిదా వేసుకున్నారు. తన నివాసం నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
మంచి ముహూర్తంలో సచివాలయంలో బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వాస్తు దోషం కారణంగానే జగన్ సచివాలయాలనికి వెళ్లలేదని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఏపీ సచివాలయం వాస్తు బాగుందని కపిలేశ్వరానందగిరిస్వామి చెప్పిన విషయం తెలిసిందే. సచివాలయంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎస్‌ను, సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ జగన్మోహనరెడ్డిని ఆశీర్వదించడానికి అగర్తల నుంచి వచ్చానన్నారు.