రాష్ట్రంలో ఏ నేరం, ఘోరం, మోసం జరిగినా, దాని వెనుక ఎదో ఒక చోట వైసీపీ పార్టీకి చెందిన ఎవరో ఒకరు ఉండటం అనేది సర్వ సాధారణం. గతంలో అనేక విషయాలు ఇవి చూసాం. ఇప్పుడు తాజగా జరిగిన బ్యాంక్ మాసంలో, ఓ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతకు చెందిన బ్యాంకులో ఏకంగా రూ. 2.64 కోట్ల నగదు మాయమైంది. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. ఖాతాదారులైన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నగదు మాయం కావడంతో ఆందోళన చెందిన బ్యాంక్ క్యాషియర్ ఈశ్వర్ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం, వవ్వేరు కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో ఈ భారీ కుంభకోణం బయటపడింది. ఈ బ్యాంకుకు వైసీపీ నేత సూరా శ్రీనివాసులు రెడ్డి ఛైర్మన్‌గా ఉన్నారు. నగదు మాయం కావడం వెనుక సూరాతో పాటు ఉద్యోగుల పాత్ర కూడా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గడచిన ఆరేళ్లలో ఖాతాదారుల ఎకౌంట్లలో తప్పుడు లెక్కలు సృష్టించి డబ్బులు స్వాహా చేసినట్లు సమాచారం. దీంతో అంతర్గత విచారణ చేపట్టిన బ్యాంక్ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో ఇంటిదొంగల చేతి వాటంపై ఆరా తీస్తున్నారు. బ్యాంక్ ఛైర్మన్ శ్రీనివాసులు రెడ్డి, ఇతర ఉద్యోగ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఖాతాదారుల సొమ్మును సొంత ఖర్చులకు శ్రీనివాసులు రెడ్డి వాడుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీనివాసులు రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ తరఫున బ్యాంక్ నగదును ఖర్చు చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాసులు రెడ్డిపై గతంలో మద్యం కేసులు ఉన్నాయి. ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్యాషియర్ ఈశ్వర్‌ను అధికారులు విచారిస్తున్నారు. ఈ బ్యాంక్‌లో ఏడాదికి రూ. వంద కోట్ల మేర లావాదేవీలు జరుగుతాయి.