వైసీపీలో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న వంగవీటి రాధా ఆశల పై అధిష్ఠానం నీళ్లు చల్లిన విషయం తెలిసిందే. మల్లాది విష్ణుకు సెంట్రల్ పగ్గాలు అప్పగించేందుకు అధిష్ఠానం సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఆదివారం వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కె.పార్థసారథి, సామినేని ఉదయభాను, వెలంపల్లి శ్రీనివాస్, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలకు సంబంధించి చర్చ జరిగినట్లు సమాచారం.
పశ్చిమ నియోజకవర్గంలో వెలంపల్లికి వ్యతిరేకంగా పలువురు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరికి వంగవీటి రాధా అండదండలు ఉన్నాయని వెలంపల్లి భావిస్తున్నారు. ఇదే విషయమై అధిష్ఠానానికి కూడా ఆయన గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో సాక్షాత్తు పెద్దిరెడ్డి రంగంలోకి దిగి పశ్చిమ నియోజకవర్గంలో వెలంపల్లికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మరోవైపు సెంట్రల్ నియోజకవర్గంలోనూ వంగవీటి రాధా, మల్లాది విష్ణు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న రాధాకు చెక్ పెట్టేందుకు ఇదే అదనుగా భావించిన వెలంపల్లి సెంట్రల్ నియోజకవర్గం బాధ్యతలను మల్లాది విష్ణుకు దక్కేలా పావులు కదపడం ప్రారంభించారు. వెలంపల్లి వర్గానికి పెద్దిరెడ్డి ఆశీస్సులు ఉండటంతో ఆయన పని మరింత సులువు అయింది. ఆదివారం నాటి సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గం బాధ్యతలు మల్లాదికే అని చెప్పించడంలో వెలంపల్లి వర్గం విజయవంతమైంది.
రాధాను సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంపై కాకుండా మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంపై దృష్టి సారించాలని పార్టీ పెద్దలు ఆదివారం సమావేశంలో సూచించినట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని రాధా వ్యతిరేకించి, సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపో యారు. సోమవారం నుంచి సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకు వైసీపీ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీన్ని మల్లాది విష్ణు నాయకత్వంలో చేపట్టాలని పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. దీంతో సెంట్రల్ సీటు రాధాకు దక్కడం అనుమానమేనని వెలంపల్లి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనూ అంతర్గత విభేదాలను పక్కకు పెట్టి వెలంపల్లి నేతృత్వంలో పనిచేయాలని పెద్దిరెడ్డి పార్టీ కార్యకర్తలకు సూచించినట్లు సమాచారం.